Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ప్రత్యక్ష కార్యాచరణ తప్పదు
- మోడల్ స్కూల్ టీచర్ల వెబినార్‌లో వక్తల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమ స్యలను పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. మే 25వ తేదీలోపు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని కోరారు. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణ తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మోడల్ స్కూళ్లు ప్రారంభమై తొమ్మిదేండ్లు కావస్తున్నా నేటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలనీ, ఆరోగ్య కార్డులు ఇవ్వాలనీ, మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం, సెకండ్ ఫేజ్ టీచర్లకు నోషనల్ సర్వీస్ కల్పించాలనీ, హిందీ పీజీటీ పోస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, హెచ్‌బీటీ, ఒకేషనల్ టీచర్లు, ట్రైనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, నైట్వాచ్మెన్లు, హాస్టల్ సిబ్బందికి 12 నెలల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో వాటి సాధన ఓసం దశలవారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ వెబినార్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, రాము, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.