Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు షర్మిల సవాల్
నవతెలంగాణ-ఇల్లందు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు పాదయాత్రకు వచ్చే దమ్ముందా అని వైఎస్సార్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలంలో గురువారం ఆమె నిర్వహించిన 'ప్రజా ప్రస్ధానం పాదయాత్ర' సందర్భంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలు లేవని తేలితే ముక్కు నేలకు రాసి వెళ్ళిపోతాననీ, సమస్యలుంటే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసి దళితున్ని సీఎం చేయాలని, సవాల్ విసిరారు. వైఎస్ఆరÊ 5 ఏండ్ల పాలనలో ఒక్కసారి కూడా ధరలు పెంచలేదని గుర్తుచేశారు. 46లక్షల ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్మెంట్ ఇలా అనేకం చేశారన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రం, జిల్లాలో పోడు పట్టాలిచ్చారనీ, బతికుంటే ఇంకా మిగిలిన పోడు పట్టాలూ ఇచ్చేవారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోడు పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం అనేక హామీలు ఇచ్చినా.. ఒక్కటీ తీర్చలేదని విమర్శించారు. పైగా రూ.4లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. కమీషన్ల రూపంలో కేసీఆర్ కుటుంబమే నొక్కేస్తుందన్నారు. తెలంగాణలో మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించలేదన్నారు. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఒక ఉద్యోగానికి 1500 మందికి పైగా పోటీ పడుతున్నారని తెలిపారు. దాంతో ఉద్యోగాలు వస్తాయోరావోనని యువత బెంగతో ఉందన్నారు. 8 ఏండ్లు ఆడింతే ఆట పాడింతే పాటగా.. ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా కేసీఆర్ అవినీతి, అక్రమ పాలన చేశారన్నారు. ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా బతుకు, భవిష్యత్ అంతా ఇక్కడే.. అందుకే ప్రజల సమస్యలు తీర్చడానికి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టా ఆశీర్వదించండి, అధికారం ఇవ్వండని అన్నారు. ఉచిత విద్య, భారీ ఉద్యోగాల కల్పన, పోడు పట్టాలు ఇచ్చి, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.