Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ కలలు కన్న కార్యక్రమం: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
- దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ
నవ తెలంగాణ-సిద్దిపేట
'మీ జీవితాల్లో వెలుగు నింపేలా భవిష్యత్ ఉండాలన్నదే దళితబంధు పథకం ఉద్దేశమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్దిదారులకు మంజూరు పత్రాలు, యూనిట్లను గురువారం పట్టణంలోని పరేడ్ గ్రౌండ్లో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఆయన కలలు కన్న కార్యక్రమం సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. దళిత జాతి ఉద్ధరణకు శ్రీకారం చుట్టిన కార్యక్రమం దళిత బంధు అని తెలిపారు. మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చేయాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. మీకు మేలు చేయాలనే ప్రతి ఒక్క లద్దిదారునికి రూ.10 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. చెడు అలవాట్లు మానుకొని, డబ్బు విలువ తెలుసుకుని, ప్రతి రూపాయికి రూపాయి జమ చేయాలని లబ్దిదారులకు మార్గనిర్దేశం చేశారు.
ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్కరూ వ్యాపారంలో వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలని సూచించారు. బీఆర్ అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. విద్య, ఉద్యోగాలలోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్టులలో సైతం దళితులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ , కలెక్టర్ హనుమంతరావు, సుడా చైర్మెన్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, అదనపు కలెక్టర్ ముజీమిల్ ఖాన్, ఎంపీపీలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.