Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్ వాగీశన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో సామాజిక, సాంస్కృతిక దాడిని ఎదుర్కోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్ వాగీశన్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో అంబేద్కర్ 131వ జయంతిని నిర్వహించారు. అనంతరం 'అంబేద్కర్ ఆలోచనలు - ప్రస్తుత రాజకీయ పరిస్థితులు' అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ఏమాత్రం పాటించని ప్రస్తుత పాలకులు అంబేద్కర్ కూడా తమ సంకుచితమైన ఆలోచనల మాదిరిగానే మతతత్వ భావాలతో ఉండేవారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దీనిని ధీటుగా ఎదుర్కోవాలంటే బాధ్యతగల ప్రతిఒక్కరూ తీవ్ర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత చాందస వాద సమాజంలో నేడు ప్రతి ఇంటిలోనూ సంకుచిత భావజాలంతో కూడిన అభిప్రాయ వ్యక్తీకరణలు పెరిగిపోయాయని సమతా వాదం, సమానత్వం దేశ ద్రోహంగా భావించబడుతున్నదని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయ, ఆర్థిక అసమానతలపైనా, సామాజిక సాంస్కృతిక దాడిపైనా పోరాటాలు చేయాలన్నారు. వాటిపై జరిగే పోరాటాలు అప్పుడప్పుడు విజయం సాధించినట్టుగా కనిపిస్తాయిగానీ అంతర్లీనంగా జరిగే సాంస్కృతిక దాడి సమాజంలో వేళ్లూనుకొని ఉన్న వివక్షను మరింత పెంచి పోషిస్తుందని వివరించారు. రాజ్యాంగ పీఠిక లో పొందుపరచబడిన సౌభ్రాతృత్వం ఈరోజు పాలిస్తున్న వారి దాష్టీకం వలన ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే. వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ దేశంలో బీమా వంటి కీలక రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని అంబేద్కర్ ఆనాడే అభిప్రాయపడ్డారని, ఆనాటి సంక్షేమ ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా బీమా రంగం జాతీయకరణ జరిగిందని గుర్తు చేశారు. 2000 సంవత్సరం నుంచి బీమారంగంలోకి ప్రయివేటు వారికి తలుపులు తెరవడంతోపాటు, ఇటీవలి కాలపు ఎల్ఐసి లాంటి గొప్ప సంస్థ లో ఐపిఓ పేరుతో ప్రభుత్వం తన వాటాలను అమ్మేస్తున్నదనీ, ఇది ప్రయివేటీకరణకు తొలిమెట్టుగా భావిస్తున్నామని అన్నారు. ఇది అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కటమేనన్నారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు బి రాజేంద్ర కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కామ్రేడ్ ఆధిష్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఆర్థికంగా వెనుకబడిన దాదాపు 15 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సందర్భంగా పుస్తకాలను ఉచితంగా ఇచ్చారు. కార్యక్రమంలో జి.తిరుపతయ్య, బి ఎస్ రవి, పి సుజాత, ఎల్ మద్దిలేటి, డి.గిరిధర్, మైథిలి, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.