Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగ రక్షణకోసం ఉద్యమించాల్సిన ఆసన్నమైందని తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) కన్వీనర్ జి రాములు, నాయకులు రఘుపాల్,తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయ క్, చేతి వృత్తిదారుల సమన్వయకమిటి కన్వీనర్ ఎం వి రమణ, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ,లక్ష్యాలను పూర్తిగా నాశనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చి మనువాద భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల ద్వారా కోట్లాదిమంది ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల వారు ఉద్యోగాలు పొందుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వాళ్ళకి అప్పగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను కాలరాసేందుకు బీజేపీ అనుబంధ మతోన్మాద సంస్థలు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. పేదలు తింటున్న ఆహారం, ఆచరిస్తున్న సంస్కృతి, ఆచారాలను అవహేళన చేస్తూ కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో పోరాడటమే అంబేద్కర్‌కు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ పోరాటంలో ప్రజా సంఘాలు, సంస్థలు ,సామాజిక సంఘాలు, ప్రజాస్వామ్య వాదులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.