Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అయినంబాకంలో అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సతీమణి వసుమతి దేవి (65) గురువారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో ఆమె తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని మరో ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన కె నారాయణ, ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపునకు నిరసనగా అక్కడి సెంట్రల్ బస్టాండు వద్ద మధ్యాహ్నం వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయనకు భార్య ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారం రావడంతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులు ఆమెను పరీక్షించి, మరణించినట్టు ప్రకటించారు. దీంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శుక్రవారం నగరి నియోజకవర్గంలోని అయినంబాకం గ్రామంలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణం పట్ల సీపీఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ, తిరుపతి జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఐ(ఎం) తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీఐటీయూ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.
కేసీఆర్, రాఘవులు, తమ్మినేని, బి వెంకట్ సంతాపం
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సతీమణి వసుమతి దేవి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖఖర్రావు, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది : చాడ
నారాయణ సతీమణి వసుమతిదేవి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. విద్యార్థిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా ఆమె విధులు నిర్వహించారని చెప్పారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారని గుర్తు చేశారు. 99 టీవీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. సాధారణ జీవితం గడుపుతూ నారాయణకు చేదోడువాదోడుగా ఉన్నారని చెప్పారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.