Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదనీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దాన్ని రక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ప్రజలకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ 131వ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ..దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళల హక్కులు, సమానత్వం కోసం అంబేద్కర్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. సామాజిక, ఆర్ధిక అసమానతలు లేని సమాజం దిశగా భారతదేశాన్ని నిర్మించాలని తన జీవితాన్ని చివరి వరకు అంకితం చేశారు. సమాజంలో మహిళలకు స్వేచ్ఛ లేకపోతే ఆ స్వాతంత్య్రానికి అర్ధం లేదని అంబేద్కర్ అన్నారు. సామాజిక అసమానతలను సృష్టించిందే హిందూయిజమనీ, దాని నుంచి అణగారిన వర్గాలు బయటకు వస్తే విముక్తి లభిస్తుందని తెలిపారు. మహిళలు దారుణమైన అవమానాలకు, హింసకు గురవడాన్ని సహించని అంబేద్కర్ మహిళలకు విముక్తి కావాలని మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లు ఓడినందుకు తన మంత్రి పదవిని సైతం వదులుకున్న గొప్ప నేత అంబేద్కర్ అని కొనియాడారు. హిందుత్వం వల్లనే సమాజంలో ఈ అసమానతలు నెలకొన్నాయని గుర్తించి దానికి వ్యతిరేకంగా చివరి వరకూ పోరాడారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ మత ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం అంబేద్కర్కి హిందూ మతాన్ని అంటగట్టడం దారుణమని చెప్పారు. బీజేపీ పాలనలో దళితులపైనా, అణగారిన వర్గాలపైనా దాడులు, సామాజిక వివక్ష పెరుగుతున్నాయన్నారు. హిందూత్వం పేరుతో దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్దిపొందుతున్నదని విమర్శించారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నదనీ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన దాడులు చేస్తున్నదని తెలిపారు. నేటి పాలకుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని నొక్కిచెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు, ఆర్.కోటంరాజు, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, ఎస్. రమ, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, వై.సోమన్న, పి. శ్రీకాంత్, పి. సుధాకర్, జి. భారతి తదితరులు పాల్గొన్నారు.