Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు సక్సెస్
- కుల, మతాల పంచాయితీలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - సిరిసిల్ల
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే కేంద్రం కాపీ కొడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళ్లర్పించారు. అనంతరం జిల్లాలో దళిత బంధు పథకం లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్దదైన డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి హైదరాబాద్ నడిఒడ్డున గొప్ప పర్యటక కేంద్రంగా రూపుదిద్దడానికి శంకుస్థాపన చేశామన్నారు. కరోనా వల్ల కొంత ఆలస్యమైనా డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని తెలిపారు. దళితుల్లో ఉత్సాహవంతులైన వ్యాపారవేత్తలను ప్రోత్సహించేలా టిప్రైడ్ (తెలంగాణ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇన్ క్యూబేషన్ ఆఫ్ దళిత్) తీసుకొచ్చిన ప్రభుత్వం.. రూ.200కోట్లతో 3000 మంది దళిత పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందించామన్నారు. తెలంగాణ ఏర్పడిందంటే కేసీఆర్ పోరాటం, ప్రజలశక్తి ఒక వైపు అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరో కారణమన్నారు. రాజ్యాంగం కొందరిదీ కాదనీ, అందరిదనీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. దేశంలో మనషులు మతం, కులం పేరుతో విడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నవి రెండే కులాలు.. పైసలు ఉన్నోడు.. పైసలు లేనోడని అన్నారు. సంపదను సమాజంలో సమానంగా పంచగలిగితే కుల వ్యవస్థను రూపుమాపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9733 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థి మీద కులాలకు సంబంధం లేకుండా ఏడాదికి 1.20లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని ఇప్పటివరకు 40 వేల మందికి అందించామనీ, ఈ ఏడాది 2 లక్షల మందికి ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందన్నారు. జిల్లాలో దళిత బంధు పథకం ద్వారా 205 యూనిట్లు మంజూరు కాగా, గురువారం ఒక్కరోజే 119 యూనిట్లకు చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
1987వ సంవత్సరంలో భారత్, చైనా స్థూల జాతీయోత్పత్తి ఒకటేనని, అప్పుడు ఇరుదేశాల జీడీపీ 400 బిలియన్ డాలర్లు ఉండేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ 35 ఏండ్లలో చైనా పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉత్పాదక రంగంపై దృష్టి పెట్టడం వల్ల ఆర్థికంగా గణనీయమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. ఇప్పుడు చైనా స్థూల జాతీయోత్పత్తి 16 ట్రిలియన్ డాలర్లు కాగా, భారతదేశానిది 2.9 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 14 వేల డాలర్లు కాగా, భారత్ తలసరి ఆదాయం 2వేల డాలర్లు అని అన్నారు. కులం మతం పేరుమీద పంచాయతీలు, రాజకీయాలతో ఆర్థికవ్యవస్థ కుదేలవుతుందని, ఇందుకు భారతే నిదర్శనమని తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖిమ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మెన్ మంచె శ్రీనివాస్, జిల్లా ఎస్సీ అబివృద్ధి అధికారి భాస్కర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు.