Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
- గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మా నాయక్
- అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ - అచ్చంపేట
జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్ అమలైందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహించారనీ, ఎవరి జనాభా ఎంత అనే పద్ధతిలో నిర్వహించిన సర్వేలో గిరిజనులు 97 శాతం ఉన్నారని, దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్ను 12 శాతానికి పెంచుతానని హామిచ్చి ఏడేండ్లు దాటినా నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. రిజర్వేషన్ల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గిరిజన విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, ఐఐటీ, పీజీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివే వారంతా పదిశాతం రిజర్వేషన్ లేకపోవడంతో చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న గిరిజన, ఆదివాసీ, ఎరుకలి సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ నాయకులు మల్లేష్, విద్యార్థి సంఘం నాయకులు బాలగౌడ్, రమేష్ తదితరులు ర్యాలీకి మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్.దేశ్యా నాయక్, ఎం.శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు ఆర్.లక్ష్మణ్, నాయకులు కష్ణ, రాములు, మోతిలాల్, ఝాన్సీరామ్, రవి నాయక్, గోపాల్ నాయక్, శంకర్ పాల్గొన్నారు.