Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో ఉండగానే ఉరేసుకున్న వైనం..
- కేటీపీపీ ఎదుట మృతదేహంతో ధర్నా
- పోలీస్ పహారా మధ్య కేటీపీపీ
నవతెలంగాణ-భూపాలపల్లి/గణపురం
తన కొడుకు ఉద్యోగం కోసం పోరాడితే.. చివరకు ప్రాణమే పోయింది. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
గురువారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రేగొండ మండలం పొనగల్లుకు చెందిన మర్రి బాబు(50) చెల్పూర్ సమీప గ్రామమైన మహబూబ్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. కేటీపీపీ మొదటి ఫేజ్‌లో బాబు తన భూమిని కోల్పోయాడు. ఆ సమయంలో అతని కొడుకు శ్రీకాంత్ మైనర్ కావడంతో ఉద్యోగం ఇవ్వలేదు. మేజరయిన తర్వాత ఇద్దామని చెప్పిన అధికారులు ఆరేండ్లుగా తిప్పుకున్నారు. రోజూ వచ్చి వెళ్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో విసిగివేసారిన బాబు ఏప్రిల్ 1వ తేదీన పురుగుల మందు తెచ్చుకొని కేటీపీపీ గేటు ఎదుట తాగాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇన్ని రోజులుగా మంజూరునగర్‌లోని స్మార్ట్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రి బిల్లు రూ.60 వేల వరకు అయింది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఆ కుటుంబం బిల్లు కట్టలేకపోయింది. ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చినా ఎవ్వరూ రాలేదు. కేటీపీపీ యాజమాన్యం బిల్లు కట్టదనే ఆలోచన, ప్రాణాలకు తెగించినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో గురువారం ఉదయం ఆస్పత్రిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కేటీపీపీ ఎదుట మృతదేహంతో ధర్నా
మర్రి పెద్ద బాపన్న (55) బాపన్న ఆత్మహత్యతో కోపోద్రిక్తులైన భూనిర్వాసితులు అతని మృతదేహంతో కేటీపీపీ ఎదుట ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు కేటీపీపీని వారి గుప్పెట్లోకి తీసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించి ధర్నాను విఫలం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకదశలో మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేసినట్టు ఆరోపణలొచ్చాయి. పోలీసులు కేటీపీపీ ముందు వాహనాలు ఆగకుండా ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. అయినా భూనిర్వాసితులు, మృతుని కుటుంబసభ్యులు భయపడకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో కేటీపీపీ ఎదుట పెద్దఎత్తున ధర్నాకు దిగారు. వారికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా భగ్నానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన పోలీసులు.. బాధితులు ఆందోళన విరమించకపోవడంతో.. చివరిగా ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ.. కేటీపీపీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందిన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ఆయన కుమారునికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు భూములు కోల్పోయిన నిర్వాసితులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.