Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజుల పాటు సమస్యలపై అధ్యయనం
- 18వ తేదీన కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
దశాబ్దాల కాలంగా నిజామాబాద్ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ(ఎం) పోరుకు సిద్ధమయ్యింది. గల్లీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్రకు నడుం బిగించింది. నిజామాబాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో 'ప్రజాదర్బార్ పాదయాత్ర' పేరిట నాలుగు రోజులు పాదయాత్ర చేపట్టారు. సుమారు 40 బస్తీలు, కాలనీలు గుండా ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నెల 18న చలోకలెక్టరేట్తో ఈ పాదయాత్ర ముగియనుంది. సీపీఐ(ఎం) నగర కార్యదర్శి మాల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్రలో నగర కమిటీ సభ్యులు కటారి రాములు, సుజాత, కృష్ణ, మహేష్ యాత్ర చేపడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజు పులాంగ్ నుంచి బోర్గాం(పి), జైభీంనగర్, సుందరయ్యకాలనీ, మున్సిపల్ కాలనీ(పాంగ్రా), ఎల్లమ్మగుట్ల, కంఠేశ్వర్, చంద్రశేఖరకాలనీ వరకు సాగింది. మొదటి రోజు పాదయాత్ర బృందం చంద్రశేఖర్‌కాలనీలో బస చేయనుంది. నేడు చంద్రశేఖరకాలనీ నుంచి గూపన్పల్లి, ఆర్టీసీ కాలనీ, మహాలక్ష్మినగర్, ముబారక్ నగర్, హౌసింగ్‌బోర్డు(తారక్నగర్), గౌతంనగర్, ఆదర్శ్‌నగర్, సంజీవయ్యకాలనీ, నాందేవ్‌వాడ, హమాల్‌వాడీ, మిర్చికాంపౌండ్ వరకు సాగనుంది. సీపీఐ(ఎం) చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బస్తీల్లో ప్రజలు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైగా రియల్ఎస్టేట్ వ్యాపారులు బస్తీలను ఖాళీ చేయించి ఆయా స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించిన ఘటనలు సైతం యాత్ర దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. నగరంలోని ప్రజానీకానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్‌తో పాదయాత్రకు శ్రీకారం చుట్టామని నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ తెలిపారు.