Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంలో రానున్న స్పష్టత
- భూసేకరణ ఆషామాషీ కాదు
- నిర్మాణానికి ఆరేండ్లు పట్టే అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం చుట్టూతా ఉన్న ప్రాంతాలు, నాలుగు జిల్లాలను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణకు మరో గెజిట్ రానుంది. ఇందుకు మరో వారం సమయం పట్టే అవకాశం ఉన్నట్టు జాతీయ రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ) ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ గెజిట్ విడుదలైతేగానీ ఏ ఏ ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలనే విషయమై అధికారులకు స్పష్టత రానుంది. తద్వారా ఏ సర్వే నెంబరు భూమి నుంచి ఆర్ఆర్ఆర్ వెళుతుందో, కల్వర్టులు, ఇంటర్చేంజర్లు ఎక్కడెక్కడ నిర్మించా లనే విషయమై పూర్తిస్థాయి అవగాహన కలగనుంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే మరో మూడు నుంచి నాలుగు నెలల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం తొలి గెజిట్ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ కార్యాలయం ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో భూసేకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చర్చనీయాంశమవుతున్నది. ఆర్ఆర్ఆర్ వెళ్లే గ్రామాలు, మండలాల్లో ఇప్పటికే భూసేకర ణపై అలజడి, ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే.
ఏ సర్వే నెంబరు..ఎవరిది
ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తరభాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల మార్గానికి సంబంధించి రెండో గెజిట్లో అన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. దీనికి 4620 ఎకరాల భూమి అవసరం కాగా, ఉత్తర భాగం వైపు 19 మండలాలు 113 గ్రామాలున్న సంగతి తెలిసిందే. కాగా ఈ గ్రామాల్లో ఏఏ సర్వే నెంబర్లు, ఏఏ వ్యక్తులు, వారు రైతులా, ఇతరులా అనే విషయం కూడా తేలనుంది. తద్వారా భూసేకరణ అధికారికంగా చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమాలోచనలు చేసి ఒక ప్రణాళికను తయారుచేస్తాయి. అనంతరం భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి.
సులువు కాదు
భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ, నిర్వాసితుల అభ్యంతరాల పరిశీలన తర్వాతే పూర్తిస్థా యిలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయం తేలనుంది. గెజిట్ అవార్డు ద్వారానే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) తర్వాత ఆర్ఆర్ఆర్కు భారీస్థాయిలో భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సులువు కాదని అంటున్న అధికారులూ లేకపోలేదు. భూసేకరణ పూర్తయి ఆర్ఆర్ఆర్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కనీసం ఆరేండ్ల సమయం పడుతుందని అంచనా. అలైన్మెంటు ఖరారుకే ఆరు నెలల నుంచి ఏడాది కానుందని ఎన్హెచ్ఏఐ సాంకేతిక నిపు ణులు అభిప్రాయపడుతున్నారు. భూసేకరణకే రెండేండ్లు పట్టనుంది. కల్వర్టులు, వంతెనలతో కూడిన రోడ్డు నిర్మా ణానికి దాదాపుగా మూడేండ్లు అవుతుందని ఇంజినీర్ల ప్రాథమిక అంచనా. ఈ పక్రియలో భూసేకరణ అతిక్లిష్టమైన ప్రక్రియ అని, అంత సులువు కాదనీ కూడా చెబుతున్నారు. అందులో జాప్యం జరిగితే ప్రాజెక్టు నిర్మాణంపై ఆ ప్రభావం పడుతుందని సమాచారం.
సర్కారు వాటా రూ.600 కోట్లు
ఆర్ఆర్ఆర్కు రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది. అందులో రూ.600 కోట్లు వ్యయం చేసింది. తాజా బడ్జెట్లో రూ. 500 కోట్లు ఇచ్చింది. వాస్తవానికి, ఉత్తరభాగం వైపు సుమారు 4760 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీనికోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరమవుతాయి. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున భరించనున్న విషయం తెలిసిందే.