Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా హక్కుల కోసం ఉద్యమం
- నిప్పును చల్లారకుండా ఉంచాలన్నది ఆమె కోరిక
- స్వరాజ్యం ప్రజల మనుసుల్లో చిరకాలం ఉంటుంది
- ట్యాంక్‌బండ్‌పై మల్లు స్వరాజ్యం విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి
- సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయనీ, దీనికి అడ్డుకట్ట వేయకపోతే మహిళలకు హక్కులుండబోవని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. జ్యోతి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మరియం ధావలే మాట్లాడుతూ దేశంలో నేడు రెండురకాల దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు చిహ్నమైన రాజ్యాంగంపైన్నే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితంపై ధరల భారాన్ని మోపి ఆర్థిక అవస్థలకు ఈ ప్రభుత్వం గురిచేస్తున్నదని విమర్శించారు. ఇంకో పక్క పనిదినాలు పడిపోయాయని వివరించారు. ఇండ్లల్లో పనిచేసే వారు, చిన్నచిన్న వృత్తులు చేసుకునే మహిళలకు పనులు దొరకటం లేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా వేతనం పడిపోయిందన్నారు. మోడీ ప్రభుత్వం బేటీ పడావో..బేటీ బచావో అంటూ ఆకర్షణీయ నినాదాలు ఇస్తున్నదని గుర్తుచేశారు. కానీ..దేశంలో మహిళలపైనా, బాలికలపైనా దాడులు, లైంగిక వేదింపులు పెరిగిపోతున్నాయని చెప్పారు. నిర్భయ ఫండ్‌లో కేవలం మూడు శాతం మాత్రమే ఖర్చు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. బేటీ పడావో అంటూనే విద్యను ప్రయివేటీకరించటం వల్ల పేద బాలికలకు విద్య దూరమైందని చెప్పారు. సర్కారు పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. ఉన్నావో, ఢిల్లీ, కతువా, కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో బాలికలపై దాడులు జరిగాయనీ, ఇదే మనువాద విధానమని చెప్పారు. దాడులకు, అత్యాచారాలకు పాల్పడిన వారు 70, 80శాతం మంది తప్పించుకుంటున్నారన్నారు. మనువాద, పితృస్వామిక భావాజాలాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాజంపై రుద్దడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. స్త్రీ మనిషి కాదు, ఒక బానిసనీ, ఆమెకు హక్కులుండవనీ, ఆమెను చదివించొద్దని వారు చెబుతున్నారన్నారు. నర్సింగ్ కోర్సుల్లో వరకట్నం తీసుకోవటం సరైందేనని సిలబస్ పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. 70ఏండ్ల స్వాతంత్య్రంలో అందరూ సమానమన్న రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వరకట్నం నేరం కాదన్న ధైర్యాన్ని వీరికెవరిచ్చారని ప్రశ్నించారు. ముస్లిం, క్రిస్టియన్ల మీద దాడులు పెరిగాయని చెప్పారు. బాల్య వివాహాలకు బీజేపీ నాయకులు హజరవడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ దేశం బీజేపీ, ఆర్ఎస్ఎస్లది సొంత ఆస్తి కాదనీ, రైతులు, శ్రామికులు, కార్మికులు, మహిళలు వీళ్లదే ఈదేశమనీ, వీళ్లకు హక్కులు కావాలని మల్లు స్వరాజ్యం తపించారన్నారు. అందుకు ఆమె జీవితం మొత్తం ఆ లక్ష్య సాధనకోసం పనిచేశారని చెప్పారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటి చైర్పర్సన్ శాంతా సిన్హా మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మల్లు స్వరాజ్యం లాంటి నాయకుల అవసరం ఉందనిపిస్తున్నదన్నారు. రాజ్యాంగంమీద, స్వేచ్ఛ, మానవ హక్కులు,శ్రామికుల జీవనం, మహిళలమీద దాడులు, కులాలమీద దౌర్జన్యాలు జరుగుతున్న తీరుపై ఆమె ఎలా స్పందించేవారో అవగతమవుతున్నదని చెప్పారు. యూనివర్సిటీల నుంచే మేధావులు పుట్టుకరారనీ, ప్రజలనుంచి కూడా మేధావులు వస్తారని ఆమెను చూస్తే అర్థమవుతున్నదని చెప్పారు. ఆమెలో కమ్యూనిజమే కాదు..హ్యూమనిజం కూడా మెండుగా ఉందని వివరించారు.
ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు వారి స్మృతిలో మల్లు స్వరాజ్యం ఓ పోరాట యోధురాలన్నారు. జీవితం చరమాంకంలో కూడా ఆమె ఆ పోరాట వేడిని కోల్పోకపోవటం గొప్పతనమన్నారు. ఓటమిని అంగీకరించటానికి సిద్ధంగా లేని గొప్ప వ్యక్తి స్వరాజ్యమన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితో పాటు ఆవేదనను కూడా పంచుకోవాలని చెప్పారు. నిప్పును చల్లారకుండా ఏం చేయాల్నో ఆలోచించాల్సిన తరుణమిదని గుర్తుచేశారు .కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆలోచిస్తూ భవిష్యత్‌పై స్వరాజ్యం కలవర పడ్డారని చెప్పారు.
ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ ఎర్రపూల వనంలోని మరో పువ్వు రాలిందని చెప్పారు. మల్లు స్వరాజ్యం ప్రజల మనిషనీ, ఆమెకు మరణం లేదనీ, ఎప్పుడూ ప్రజల్లో జీవిస్తూనే ఉంటారని చెప్పారు. నాలుగు తరాలకు మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు.. చావులో కూడా పోరాట స్ఫూర్తిని నింపారన్నారు. ధైర్యానికి ప్రతిరూపం మల్లు స్వరాజ్యమన్నారు. ఎవరికీ భయపడని ధీరత్వం ఆమెదని చెప్పారు. స్వరాజ్యం పోరాట స్ఫూర్తితో మోడీ దిగిపో అనే నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఆ సంఘం సీనియర్ నేతలు అల్లూరి మన్మోహినీ, పుతుంబాక భారతి, ఆంద్రప్రదేశ్ ఐద్వా అధ్యక్షులు ప్రభావతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యు) నేతలు సంధ్య, ఝాన్సీ, ఎన్సీపీసీఆర్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ట్రస్టీ గీతా రామస్వామి, కాలమిస్టు సజయ, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షరాలు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షురాలు హైమావతి, సాంస్కృతిక కార్యకర్త పిఏ దేవి, ఆరుణోదయ నాయకురాలు విమలక్క, ఇందిర.ఆశాలత, స్వరాజ్యం కూతురు కరుణ, ఆమె కుమారులు మల్లు గౌతం రెడ్డి, నాగార్జునరెడ్డి తదితరులు ప్రసంగించారు. మల్లు స్వరాజ్యం స్మృతి పథంలో పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మల్లు స్వరాజ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ సభలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆకర్షణీయంగా ఫొటో ఎగ్జిభిషన్
1930 నుంచి చివరి శ్వాస వరకు ఉద్యమ పథంలో మల్లు స్వరాజ్యం పోరాటాలు,ఆమె పాల్గొన్న ఉద్యమాల చిత్ర మాలిక (ఫొటో ఎగ్జిభిషన్‌ను ఎన్సీపీసీఆర్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా ప్రారంభించారు. అనంతరం శాంతసిన్హా మాట్లాడుతూ స్వరాజ్యం ఫొటో ఎగ్జిభిషన్ ప్రారంభించటం తన ఆదృష్టమని చెప్పారు.