Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జీల సంఖ్యను పెంచితేనే త్వరితగతిన కేసుల పరిష్కారం : న్యాయాధికారుల సదస్సులో
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- చేతికి ఎముక లేదనే సామెతకు కేసీఆర్ ట్రేడ్ మార్క్ అంటూ కితాబు
- తెలంగాణ న్యాయవ్యవస్థ దేశానికే ఆదర్శమవ్వాలి : సీఎం కేసీఆర్
- జడ్జి, మెజిస్ట్రేట్ పోస్టులను పెంచాలని విజ్ఞప్తి
- సీజేఐ చొరవతోనే హైకోర్టులో 42 బెంచ్‌ల ఏర్పాటు
- హైకోర్టు న్యాయమూర్తులందరికీ ఒకేచోట నివాసాలు నిర్మిస్తామంటూ హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో న్యాయవ్యవస్థను ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి జడ్జీల సంఖ్య పెంపు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ప్రశంసించారు. చేతికి ఎముక లేదనే సామెతకు ఆయన ట్రేడ్‌మార్క్ అంటూ కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు దాదాపు 400 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు. 'తెలంగాణ న్యాయమూర్తుల సంఘం' వెబ్‌సైట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శనివారం కూడా ఈ సదస్సు కొనసాగనున్నది. రాష్ట్రంలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్డేట్ కావడం, తదితర మౌలిక వసతులను మెరుగు పరచడం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించే చర్యలతో పాటు న్యాయ వ్యవస్థ లో పని చేస్తున్న వారి సంక్షేమానికి తగు చర్యలు చేపట్టడం అనే అంశాలపై తొలిరోజు చర్చించారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటే కేసీఆర్ న్యాయశాఖలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం శుభపరిణామమన్నారు. హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామనీ, జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ప్రారంభమైందనీ, వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతున్నదని చెప్పారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు సీఎం కోరుతున్నారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని తెలిపారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి గారు చెప్పినట్టు అందరికీ వీణలు బహుకరించిన సీఎం కేసీఆర్ నాకు మాత్రం నెమలిని బహుకరించారు. బహుశా అది జాతీయ పక్షి కావడం చేతకావచ్చు...' అంటూ సీజేఐ వ్యాఖ్యానించటంతో సమావేశమందిరంలో నవ్వులు విరిశాయి. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలోని న్యాయవ్యవస్థ దేశానికే ఆదర్శం కావాలని రాష్ట్ర ఆకాంక్షించారు. జస్టిస్ ఎన్వీ రమణ చొరవతోనే హైకోర్టులో 42 బెంచ్‌లు ఏర్పాటయ్యాయనీ, ఆయనకు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 30 నుంచి 40 ఎకరాల స్థలంలో 42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్లు నిర్మిస్తామని ప్రకటించారు. వాటి శంకుస్థాపనకు సీజేఐను ఆహ్వానిస్తామన్నారు. ఆయన చొరవతోనే అల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక న్యాయపరిపాలన మరింత మెరుగ్గా సాగేందుకు 4348 పోస్టులను భర్తీ చేశామన్నారు. జడ్జి పోస్టులను, మెజిస్ట్రేట్ పోస్టుల సంఖ్యను పెంచాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. అందరి సహకారం, సమన్వయంతో, ఆర్థిక జాగురూకత, కఠిన క్రమశిక్షణను అమలు చేయడంతో రాష్ట్ర పురోగతి వేగంగా ముందుకు సాగుతున్నదన్నారు. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లెక్కల ప్రకారం 2014-15 లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుండగా నేడు అది రూ. 2.78 లక్షలకు చేరుకోవడం గొప్ప పరిణామమన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వ్యవసాయ, పారిశ్రామిక, సమాచార సాంకేతిక రంగాలు అద్భుతంగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచ్‌ల సంఖ్య పెంచాలని తానే స్వయానా ప్రధానికి లెటర్ రాసినా చాలా కాలం పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. సీజేఐగా రమణ వచ్చాక చొరవ తీసుకుని... ప్రధానమంత్రితో, కేంద్రప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ హైకోర్టులో 24 నుంచి 42కు బెంచ్‌ల సంఖ్యను పెంచారని కొనియాడారు. రాష్ట్ర న్యాయశాఖకు గతంలో 780 పైచిలుకు పోస్టులను మంజూరు చేశామన్నారు. బెంచ్‌లు పెరిగాక హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ విజ్ఞప్తితో పరిపాలనా సౌలభ్యం కోసం మరో 885 అదనపు పోస్టులను మంజూరు చేశామని చెప్పారు. ఆ జీవోను ఎన్వీ రమణకు పంపామన్నారు. జిల్లా కోర్టుల్లో పనిభారం బాగా ఉందనీ, తదనుగుణంగా జడ్జి, మెజిస్ట్రేట్ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. నూతన జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టుల నిర్మాణం కోసం స్థలాలను ఎంపిక చేసి అన్ని వసతులతో కూడిన భవనాలను నిర్మిస్తామని హామీనిచ్చారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కోర్టులకు 1730 అదనపు పోస్టులను కూడా మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. న్యాయశాఖకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీనిచ్చారు. 'డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్'లో భాగంగా 1.52 కోట్ల ఎకరాల భూముల డిజిటలైజ్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. అంతర్జాతీయ వర్తక, వ్యాపార, వాణిజ్య 'డిస్పోజల్' లో స్పీడు పెరిగితే మరింత ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందనీ, ఈ విషయంలో న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సీజేఐతో పాటు పలువురు సత్కరించారు. గ్రూపుఫొటోలు దిగారు. ఈ సదస్సులో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రమణ్యం, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్, తదితరులు పాల్గొన్నారు.