Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు
- కెరమెరిలో 43.9 డిగ్రీల ఎండ
- వచ్చే మూడ్రోజులు మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓవైపు విపరీత ఎండ..మరోవైపు ఉక్కపోత..సాయంత్రం పూట చిరుజల్లులతో రాష్ట్రంలో శుక్రవారం విభిన్న వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండ దంచికొడుతున్నది. పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరాయి. కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధింగా 43.9 డిగ్రీల ఎండకాసింది. అదే సమయంలో మిగతా జిల్లాల్లో ఒక డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్నగరంతో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం పూట చిరుజల్లులు కురిశాయి. సంగారెడ్డి, నాగర్కర్నూల్
జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అత్యధికంగా 2.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 24 ప్రాంతాల్లో వర్షపాతం రికార్డయింది. జీహెచ్ఎంసీలోని ఉప్పల్ సర్కిల్లోని మారుతినగర్లో 2.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. రానున్న మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా అక్కడక్కడా పడొచ్చని పేర్కొన్నారు. దక్షిణ, ఆగేయ దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.