Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలింపు
- చెక్‌పోస్టులు దాటి తరలివస్తున్న వైనం
- వే బిల్లులు లేకుండానే డంప్
- మీడియాతో మాట్లాడేందుకు ఏడీ నిరాకరణ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లాను మహారాష్ట్ర ఇసుక ముంచేత్తుతోంది. జిల్లాలో నిర్మాణ రంగం ఊపుమీద ఉంది. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు అనుమతులు లేకుండా మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇసుక తరలిస్తే టీఎస్ఎండీసీ అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండానే లారీల్లో టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకంగా పది కేసులు నమోదు చేశారు. కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే ఇసుక తరలింపు సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిప్పుకు ఇంత అంటూ లెక్కలేసి మరీ వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్, వాజీద్నగర్, పుల్కల్ తదితర ఇసుక క్వారీలు కొంతకాలంగా మూసివేశారు. ఇక్కడి నుంచి ఇసుక సరఫరా ఆగింది. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని మచ్నూర్ నుంచి కుందల్వాడీ అటునుంచి ధర్మాబాద్ నుంచి బాసర్ మీదుగా నవీపేట్ నుంచి నిజామాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అలాగే కందకుర్తి నుంచి నవీపేట్ మీదుగా మరో రూట్లో ఇసుక తరలిస్తున్నారు. హంగర్గ మీదుగా బోధన్‌కు సైతం నిత్యం ఇసుక లారీలు వస్తున్నాయి. నిత్యం 40-50 అక్రమంగా ఇసుక లారీలను సరిహద్దు దాటిస్తున్నారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు ఇసుక తరలిస్తే టీఎస్ఎండీసీ అనుమతి తప్పనిసరి. కానీ అవేవీ పట్టించుకోకుండా అధికారులకు అమ్యామ్యాలు చెల్లిస్తూ దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. ఇటీవల రూరల్ పోలీసు స్టేషన్ పరిధితో పాటు నవీపేట్, మాక్లూర్, నిజామాబాద్ ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు లారీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం పది కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర వే బిల్లులతో జిల్లాకు ఇసుక వస్తోంది. పైగా మహారాష్ట్ర వే బిల్లులలోనూ 30 టన్నులకు అనుమతి తీసుకుని 50-60 టన్నుల ఇసుక తరలిస్తున్నారు. ఆ ఇసుకను జిల్లాలోని గృహ యజమానులకు టన్నుకు రూ.1100-1150 అమ్ముతున్నారు. బీర్కూర్ ఇసుక క్వారీ ఉంటే జిల్లా కేంద్రంలో ఇసుక వినియోగదారులకు టన్నుకు కేవలం రూ.800 మాత్రమే లభించేది. అయితే అనుమతులు లేకుండా ఇసుక తీసుకురావడంతో పాటు ఇటు వినియోగదారుడి నుంచి కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ కొరలు లేని పాములా తయారయ్యింది. సరిపడా సిబ్బంది లేక ఆ శాఖ నిర్వీర్యమవుతుంది. ప్రస్తుతం ఏడీతో పాటు ఆర్ఐ మాత్రమే విధుల్లో ఉన్నారు. ఏడీకి అదనంగా కరీంనగర్ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఇసుక రాయుళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమ ఇసుక రవాణాపై వివరణ కోరేందుకు మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణను ప్రయత్నించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు. ఉన్నతా స్థాయి అధికారులు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాబోమని అన్నారు.