Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైద్రాబాద్లో ఆలిండియా జ్యుడీషియల్ డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు
- చిన్నచిన్న విషయాలకు ఫిర్యాదులు చేసుకోకండి...
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ బార్ అసోసియేషన్ ఘన సన్మానం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కొత్తగా వత్తిలోకి వచ్చిన న్యాయవాదులకు వసతి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందనీ, దీనికోసం తాను ప్రయత్నిస్తాననీ చెప్పారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఆలిండియా జ్యుడీషియల్ డేటా మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తాము భావించామనీ, దీనికోసం నాగ్పూర్ లేదా మరో ప్రాంతం సూచించారని తెలిపారు. తాను మాత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సూచించానన్నారు. అది ఏర్పాటైతే హైదరాబాద్ నగరానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు వస్తుందని చెప్పారు. నేషనల్ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలనీ, చిన్ని చిన్ని విషయాలకు ఫిర్యాదుల చేసుకోవద్దనీ సూచించారు. తెలంగాణ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారంనాడాయన్ని హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ బావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేననీ... తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్టే ఫీలవుతానని అన్నారు. తెలంగాణ హైకోర్టులో తిరుగుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నానని చెప్పారు. 11 ఏండ్లు తానిక్కడ పనిచేశాననీ, హైకోర్టు తనకు చాలా నేర్పిందంటూ పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తాను ఎప్పుడూ తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినేనని తెలిపారు. తెలంగాణ సాధన కోసం న్యాయవాదులు, అడ్వకేట్లు చాలా శ్రమించారని అన్నారు. కేసులు లేనప్పుడు ఖాళీగా కూర్చున్న రోజులు... అప్పట్లో సిద్ధయ్య క్యాంటీన్లో టీ తాగిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం అందాలంటే కోర్టులు అందుబాటులో ఉండాలనీ, వాటిలో మౌలిక సదుపాయాలూ ఉండాలని చెప్పారు. దీనికోసం జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామనీ, అక్కడి నుంచి ఆమోదం రావల్సి ఉందన్నారు. ''దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1100 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. 400 ఖాళీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మే నెలాఖరు వరకు మరో 200 మంది జడ్జిల నియామకం పూర్తి అవుతుంది. తెలంగాణలో 24 ఉంటే 42 చేశాం. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం సభ్యులు పేర్లు సూచిస్తే వాటిని భర్తీ చేస్తాం'' అని ఆయన వివరించారు. తెలంగాణలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారనీ, కొన్ని కోర్టులకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామన్నారంటూ ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం న్యాయవాదుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. న్యాయవాద వత్తినే మానేసే స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ వల్ల వారు ఎంతో నష్టపోయారనీ, వారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు తెలిపారు. సీనియర్ న్యాయవాదులు వారిని పెద్ద మనసుతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.