Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే 24 గంటల కరెంట్ : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఊర్లల్లో మూడు రోజులుగా మూడు నుంచి ఐదు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారనీ, అదే సమయంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకు మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఇలాఖాకు పోదామా? విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇలాకకు పోదామా? ఎక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నారో చూపెట్టాలని సవాల్ విసిరారు. శుక్రవారం నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరి పంట పొట్టకొచ్చిన దశలో కరెంటు కోతలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో 15 రోజులు 24 గంటల కరెంటు అందిస్తే 100 శాతం దిగుబడి వస్తుందని చెప్పారు. రాష్ట్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా చేస్తుందా? నిజంగా కరెంటు కొనేందుకు పైసలు లేకనా? అనేది అర్ధం కావడం లేదన్నారు. విద్యుత్ శాఖలో రిటైర్డయిన వ్యక్తి ఆ శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్నారనీ, విద్యుత్‌కు సంబంధించి ఏమైనా కేసులైతే వారినే ఇరికించాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో కరెంట్ ఇచ్చి పక్కనే ఉన్న గ్రామాల్లో కరెంటు కోతపెట్టడంతో రైతులంతా సబ్‌స్టేషన్‌ముందు ధర్నా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈఆర్సీ చైర్మెన్ రంగారావు రాష్ట్రంలో డిస్కమ్‌లకు రాష్ట్ర సర్కారు రూ.17,202 కోట్ల బకాయిలున్నదని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన అనంతరం తెలంగాణకు 290 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 500 టీఎంసీల పైచిలుకు జలాలు అని కేసీఆర్, చంద్రబాబు ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. తాను చెప్పింది అబద్ధం కాదనీ, తన దగ్గరకొస్తే అన్ని నివేదికలు చూపెడతాననని చెప్పారు.