Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ నిరంతరం సరఫరా చేస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోతలు పెడుతున్నదని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. త్రీఫేజ్ గల విద్యుత్‌ను రోజుకు ఏడు గంటలే ఇస్తున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. యాసంగిలో వరి, మొక్కజొన్న, కూరగాయాలు తదితర పంటలు కోతకు వచ్చే దశలో ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో నీరు లేకపోతే నోటికి వచ్చిన పంట ఎండి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. పెట్టిన పెట్టుబడి రాక రైతు నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది.
అందువల్ల పంటలు చేతికి వచ్చేవరకు త్రీఫేజ్ల కరెంట్ రోజంతా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొతినేని సుదర్శన్‌రావు, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 36 లక్షల ఎకరాల్లో వరి సాగైందనీ, అందులో 10 లక్షల ఎకరాలు బావుల కింద వేశారని తెలిపారు. మరో ఏడు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, ఐదు లక్షల్లో కూరగాయలు, ఐదు లక్షల్లో జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాగు చేశారని పేర్కొన్నారు.
ఇవన్నీ మరో 15 రోజుల్లో కోతకు వస్తాయని తెలిపారు. అంతవరకు నీటి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ త్రీఫేజ్ కాకుండా టూఫేజ్ ఇస్తే కరెంట్ మోటర్లు పని చేయవని గుర్తు చేశారు. వరికి బదులుగా వేసిన పంటలతోపాటు మిగిలిన పంటలు చేతికి వచ్చేవరకు నిరాటంకంగా కరెంట్ సరఫరా చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఎండలకు నీరు లేకుంటే 2, 3 రోజులోనే పంటలకు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు ముగిసేవరకు విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు వీధుల్లోకి వస్తున్నారనీ, ఇది ఉధృతం కాకముందే ప్రభుత్వం కరెంట్ సరఫరాను మెరుగుపరచాలని కోరారు.