Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ప్రయాణీకులపై యాజమాన్యం సెస్‌ల పేరుతో దొంగదెబ్బలు కొడుతోంది. నిన్న ఎక్కిన బస్సులోనే తెల్లారి ఎక్కితే టిక్కెట్ రేటు తెలీకుండా పెరుగుతున్నది. అడ్డూ అదుపూ లేకుండా ఇష్టం వచ్చినట్టు సెస్‌ల పేరుతో చార్జీలను పెంచేస్తున్నారు. హేతుబద్ధీకరణ (రౌండప్) పేరుతో ఇప్పటికే టిక్కెట్ రేట్లను పెంచిన యాజమాన్యం డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రెండ్రూపాయలు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.5 పెంచిన విషయం తెలిసిందే. ఇది కాకుండా టోల్ చార్జీలు, సేఫ్టీ సెస్ పేరుతోనూ టిక్కెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు రిజర్వేషన్ చార్జీలను రూ.20 నుంచి రూ.30 వరకు పెంచారు. అయితే ఈ పెంపు మార్చి 27 నుంచి అమల్లోకి వచ్చినా, యాజమాన్యం ప్రయాణీకులకు కనీసం మాటమాత్రంగా కూడా సమాచారం ఇవ్వలేదు. విద్యార్థులు సహా అన్ని కేటగిరీల బస్‌పాస్ రేట్లనూ భారీగా పెంచేశారు. పెరిగిన బస్సుచార్జీలతో పాటు ఇప్పుడు పెరిగిన రిజర్వేషన్ చార్జీలను కూడా కలుపుకుంటే ప్రయాణీకులపై దాదాపు 15 నుంచి 20 శాతం వరకు ఆర్థికభారం పడుతున్నది. టిక్కెట్ మూల ధరను పెంచకుండా సెస్‌ల పేరుతో అదనంగా ఆర్టీసీ ప్రయాణీకులను బాదేస్తున్న విషయం తెలిసిందే.