Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ నగరానికి కృష్ణానీళ్లను తీసుకురావడంలో ఇంజినీర్ జి ప్రభాకర్ కృషి ప్రశంసనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆయన రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ మాజీ అధ్యక్షులు జి ప్రభాకర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వమేది ఉన్నా ప్రభాకర్ తెలంగాణ కోసం చిరస్మరణీయ సేవలు అందించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని తెలంగాణ కోసం సలహాలు, సూచనలు ఇచ్చేవారని అభిప్రాయపడ్డారు. ఏదైనా నిర్మోహమాటంగా సూటీగా చెప్పేవారనీ, విద్యాసాగర్‌రావుతో కలిసి రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాముల య్యారని చెప్పారు. శ్రీకృష్ణకమిటీ రిపోర్ట్‌కు కూడా ఆయన తన వంతు సహకారం అందించారని వివరించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్‌రావు మాట్లాడుతూ ఇంజినీర్ ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ట్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మెన్ బి. బ్రహ్మరెడ్డి, మాజీ చైర్మెన్ రమణానాయక్, గౌరవకార్యదర్శి జి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.