Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
- పకడ్భందీగా సభ్యత్వాన్ని నమోదు చేయాలని ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ నేతలతో ఈ పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. నేతలు పోరాటాల ద్వారానే ఎదగాలనీ, సిఫారసుల ద్వారా కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో ఈనెల 22 నుంచి టీడీపీ మెంబర్షిప్ కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించారు. రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే, రూ. 2 లక్షల బీమా వర్తిస్తుందని వివరించారు. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై దష్టి సారించాలని సూచించారు. బలహీనవర్గాల గొంతుకగా తెలంగాణలో టీడీపీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ముందుకు వెళ్తామని ప్రకటించారు. పార్టీకి 40 ఏండ్లుగా ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తే, నా హయంలో అభివృద్ధి చేశామన్నారు. ఐటీ రంగంలో ఈరోజున్న పరిస్థితికి, అప్పటి మన ప్రభుత్వ చర్యలే కారణమన్నారు. ఏపీలో అభివృద్ధి పనులను చెడగొట్టారనీ, కాబట్టే పతనావస్థకు చేరిందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. అప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో నాయకులందరికీ జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అర్వింద్కుమార్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్రావు, జాతీయ అధికార ప్రతినిధులు దయాకర్‌రెడ్డి, ప్రొఫెసర్ జ్యోత్స్న, జాతీయ ఉపాధ్యక్షులు కె.విశ్వనాథ్, నాయకులు సీతా దయాకర్‌రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.