Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడిచేయడంతో ఆస్పత్రి పాలు
- కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఆశా వర్కర్‌ను వేధిస్తున్న నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం ఆకుల కొండూరు సర్పంచ్ కోట అశోక్‌రావుపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత డిమాండ్ చేశారు. సర్పంచ్ దాడి చేయడంతో ఆస్పత్రి పాలైన ఆశా వర్కర్ అరుణను జిల్లా ఆస్పత్రిలో ఐద్వా నాయకులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరుణ తన ఇద్దరు పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో సర్పంచి కొద్దిరోజులుగా వేధిస్తున్నాడని గతంలో రూరల్ పీిఎస్పీలో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట అశోక్‌రావు అరుణ ఇంటికి వెళ్లి దాడి చేశాడని, చెప్పుతో దారుణంగా కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛగా బతికే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో ఏ మాత్రమూ బాధ్యత వహించడం లేదని విమర్శించారు. వెంటనే సర్పంచ్ అశోక్‌రావును సస్పెండ్ చేయాలని, పోలీస్ శాఖ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఐద్వా ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆమె వెంట ఐద్వా నాయకులు గీతాంజలి, పద్మ తదితరులు పాల్గొన్నారు.