Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020-21 యాసంగి ధాన్యం సీఎంఆర్‌కు ముగిసిన గడువు
ఏయేటికాయేడు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నారు. గడువులోపు ఇచ్చిన ధాన్యాన్ని మరపట్టించి క్వింటాల్ ధాన్యంలో 67శాతం బియ్యం అందించాల్సి ఉంది. అయితే, సీజన్ పోయి మళ్లీ అదే సీజన్ వచ్చినా ధాన్యాన్ని మర పట్టించడంలో అలసత్వం కొనసాగుతూనే ఉంది.
- 10శాతం చొప్పున ఇంకా ఇవ్వాల్సిన నాలుగు జిల్లాలు
- ఈ నెలాఖరు వరకు గడువు
- మొన్నటి వానాకాలం సీఎంఆర్ బహుదూరమే!
- ఇప్పుడు మిల్లులకు రానున్న ఈ యాసంగి ధాన్యం
- మిల్లర్ల ఇష్టారాజ్యానికి అధికారుల అండ
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
2020-21 యాసంగికి సంబంధించిన ధాన్యం మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాలూ కనీసంగా 10 నుంచి 15శాతం ఇంకా ఇవ్వాల్సి ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ యాసంగి ధాన్యం మరోపక్షం రోజుల్లో మిల్లులుకు రానున్న క్రమంలో సేకరించిన పంటను నిల్వ చేసే ఇబ్బందులు తలెత్తే సమస్యలు ఎదురుకానున్నాయి. డెడ్లైన్ల మీద డెడ్లైన్లు.. ఇలా సీఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు మిల్లులకు ఎన్ని నెలలు పొడిగించినా ఇంకా మిల్లర్లు అలసత్వంగానే వ్యవహరిస్తున్నారు. యాసంగి పంట ధాన్యాన్ని సాధారణంగా వానాకాలం పంట వచ్చేలోపు మిల్లర్లు సీఎంఆర్ ప్రక్రియ పూర్తి చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. 2020-21 యాసంగి పంట విషయంలో పలు వాయిదాల తరువాత చివరగా మార్చి 31లోపు పూర్తి చేయాలన్న గడువు విధించారు. ఇప్పుడు మరోనెల సమయం పొడిగించారు. అయిన్పటికీ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలు కొంత వెనుకబడే ఉంటున్నాయి. ఇక 2021-22 వానాకాలం పంటకు సంబంధించిన సీఎంఆర్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో కనీసం 50శాతం కూడా దాటలేదు. వానాకాలంలో పంట దిగుబడి తక్కువగా ఉండగా, సన్నబియ్యం తిండి అవసరాల కోసం రైతులే ఎక్కువగా నిల్వ చేసుకున్నారు. గత యాసంగితో పోల్చితే వానాకాలంలో మిల్లులకు వచ్చిన ధాన్యం తక్కువగానే ఉన్నా.. ఆ పంటనూ మిల్లింగ్ చేసే ప్రక్రియ 50శాతం పూర్తి చేయలేదు.
ఎఫ్‌సీఐకి ఇవ్వడంలో కారణాలు అనేకం..
తమకు కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించే ప్రక్రియకు గరిష్టంగా రెండు నెలల గడువు ఉంటుంది. మిల్లులు తీసుకున్న ధాన్యానికి క్వింటాల్‌కు 68కిలోల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 350 బాయిల్డ్ రైస్‌మిల్లులు, ముడి బియ్యం(రా రైస్) మిల్లులు 320 వరకు ఉన్నాయి. ఈ మిల్లులు పౌరసరఫరాల శాఖ కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి క్వింటాకు 68కిలోల చొప్పున బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా వేరే మార్గాల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతో.. సకాలంలో ఎఫ్‌సీఐ గోదాములకు బియ్యం చేరడం లేదు. చివరి నిమిషంలో పీడీఎస్ బియ్యాన్ని, మిల్లులో తాము నేరుగా కొనుగోలు చేసిన రెండో రకం ధాన్యాన్ని మరపట్టించి నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నట్టు ఫిర్యాదులూ లేకపోలేదు. అందులోనూ రాష్ట్రంలోనే మెజార్టీ మిల్లులున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ దందా సాగుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. అయితే, మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్ని మిల్లులను బ్లాక్‌లిస్టులో పెడుతున్నారు. అయినప్పటికీ ఎక్కడో అధికారుల ఉదాసీనత వల్ల మిల్లింగ్ 'కష్టం'గా మారుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.
నెలాఖరులోగా సేకరిస్తాం
శ్రీకాంత్- కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్
జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచీ ధాన్యం పెద్దఎత్తునే సేకరించాం. దీంతో సీఎంఆర్ కొంత ఆలస్యం అవుతోంది. అయినప్పటికీ జిల్లాలో 92శాతం మిల్లింగ్ పూర్తి చేశాం. మిగతాది ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం.