Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
- భువనగిరిలో రాస్తారోకో
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజ్‌పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణగౌడ్‌ను కులదురహంకార హత్య చేయించిన దుండగులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. యువకుడి కాళ్లకు, చేతులకు మేకులు కొట్టి చంపి.. ఆపై పాతిపెట్టడాడానికి రూ.10లక్షలు సుఫారీ ఇచ్చిన యువతి తండ్రి వీఆర్ఓ వెంకటేష్, హత్యచేసిన దుండగులను వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ ప్రజాసంఘాల నేతలు భారీగా తరలివచ్చి రాస్తారోకో నిర్వహించారు. మృతుడు రామకృష్ణగౌడ్ భార్య భార్గవి తన 6నెలల పసిపాపతో వచ్చి కూర్చుంది. రామకృష్ణ తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలం గౌరయాపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేష్ తన కుమార్తె భార్గవి రామకృష్ణను కులాంతర వివాహం చేసుకున్న నాటి నుంచి అతనిపై కక్ష పెంచుకున్నాడన్నారు. గతంలో సూర్యాపేట వద్ద కిడ్నాప్ చేశారని తెలిపారు. మళ్లీ మూడేండ్ల తర్వాత రూ.10లక్షలు సుఫారీ మాట్లాడి లతీఫ్ అనే రౌడీ షీటర్ ద్వారా రియల్ ఎస్టేట్ భూములు చూపించాలని రామకృష్ణను బయటకు తీసుకెళ్లి చంపేశార న్నారు. గుండాల వద్ద చేతులు, కాళ్లకు, తొడకు మేకులు కొట్టి హత్య చేసి గజ్వేల్ సమీపంలోని లకుడారం వద్ద బొందతీసి పాతి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రే కుమార్తెను వితంతువును చేశాడని, పసికందుకు తండ్రిని దూరం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మిర్యాలగూడలో మారుతిరావు ప్రణరుని చంపించినట్టుగానే ఈ సంఘటన జరిగిందన్నారు. భువనగిరిలో వరుసగా నాలుగు కులదురహంకార హత్యలు జరిగాయన్నారు. తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడం వల్ల వరుస హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇంటితోపాటు పసిపాప చదువు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అంకుముందు స్కైలాబ్ బాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బలరాజ్ గౌడ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నంపట్ల కృష్ణ, సిర్పంగి స్వామి తదితరులు రామకృష్ణ నివాసంలో భార్గవిని ఓదార్చారు. రాస్తారోకోలో దళిత ఐక్యవేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పొత్నక్ ప్రమోద్ కుమార్, పీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తంగాలపెళ్లి రవికుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలకమరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.