Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం బాగుపడాలంటే రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలుండాలి....
- ఆర్థిక సహకారం కోరినా స్పందన కరువు : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
- ఆన్ కామర్స్ సమావేశంలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విభజన హామీలతో పాటు వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన సహాయ, సహ కారాలపై కేంద్రం శీతకన్నేసిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆవేదనవ్యక్తం చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం సోమవారం హైదరాబాదులోని శాసనసభ కమిటీ హాల్లో నిర్వహించారు. ఆ కమిటీ చైర్మెన్ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్ ఈ కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహాకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఇండిస్టియల్ కారిడార్లతో పాటు డిఫెన్స్ కారిడార్ ఫార్మాసిటీ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులకు అవసరమైన ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదని ఆయన తెలిపారు. ఆదిలాబాద్‌లో సీసీఐని పునరుద్ధరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలను తీసుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనీ, తెలంగాణ అభివృద్ధే దేశాభివృద్ధి అని కేంద్రం గుర్తించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి వచ్చే సంపద దేశంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నదని తెలిపారు.
'సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులను దేశం అందిపుచ్చుకోవాలి. విధాన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలి. ఈ-కామర్స్‌పైన జాతీయ పరమైన పాలసీని సత్వరం తీసుకురావాలి. ఇందులో ఈ కామర్స్‌కి అనుబంధంగా ఉన్న ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్, అత్యుత్తమ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండటం వంటి సంబంధిత అన్ని రంగాలపైనా విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలి, సిటిజన్ సర్వీస్ డెలివరీకి సంబంధించి కేంద్రం మరింత చురుగ్గా కదలాలి. డిజిటల్ లిటరసీపైన దృష్టి సారించాలి...' అని కేటీఆర్ సూచించారు.