Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణం చట్టం తేవాలి
- భార్గవి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారుల వైఫల్యం వల్ల కులదురహంకార హత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లాలో ప్రణరు, ఆంబోజు నరేష్- స్వాతి హత్య మరవకముందే, యాదాద్రి భువనగిరి జిల్లాలో రామకృష్ణగౌడ్ కుల దురహంకార హత్య జరగడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కులవివక్ష, కుల దురహంకార హత్యలు, దాడులనరికట్టేందుకు సమగ్ర విధానం తీసుకురావడంతోపాటు, ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూతురు భార్గవిని గౌడ కులానికి చెందిన రామకృష్ణగౌడ్ ప్రేమించి పెండ్లిచేసుకున్నాడన్న కోపంతో ముదిరాజ్ కులానికి చెందిన పల్లెర్ల వెంకటేశం సుపారీ గ్యాంగ్‌తో రామకృష్ణగౌడ్‌ను సుత్తితో శరీరంపై మేకులు దింపి, చిత్రహింసలకు గురిచేసి అత్యంత కిరాతంగా హత్యచేసి పాతిపెట్టారని తెలిపారు. భర్త కనిపించడంలేదని భార్గవి పోలీసులకు సమాచారమిచ్చిన వెంటనే వారు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వంతోపాటు, పోలీసు అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నదని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రామకృష్ణగౌడ్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, ఆ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్బెడ్రూం ఇల్లు, మూడెకరాల భూమి ఇచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.