Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిమాండ్ కోసం కోర్టుకు తరలింపు
- రూ.10 లక్షల సుఫారీ : ప్రెస్మీట్లో ఏసీపీ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగోండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ హోంగార్డ్డు ఎరుకల రామకృష్ణగౌడ్(32) హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్టు భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామకృష్ణ భార్య భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్టు తెలిపారు.
రామకృష్ణ, భార్గవి భువనగిరి పట్టణం తాతానగర్‌లో నివాసముం టున్నారన్నారు. వీఆర్ఓ పల్లెపాటి వెంకటేష్ కూతురు భార్గవిని రామకృష్ణ ప్రేమించి పెండ్లి చేసుకున్నట్టు వివరించారు. రామకృష్ణ మాజీ హోంగార్డు కాగా.. రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో ఓ కేసులో సస్పెండ్ కావడం వల్ల ఉద్యోగం పోయిందన్నారు. ఈనెల 15న 9 గంటలకు జమ్మాపురం సర్పంచ్ అమృత రావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మోత్కూర్, వలిగొండకు వెళ్లాడన్నారు. అయితే, మధ్యాహ్నం తరువాత రామకృష్ణ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని, దాంతో భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సయ్యద్ లతీఫ్, అతని అనుచరులను సిద్దిపేటలో అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఆస్తిలో వాటా కోసం కోర్టులో కేసు వేస్తానని మామను బెదిరిస్తుండటం వల్ల అల్లున్ని వదిలించుకోవాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడన్నారు. దోర్నాల యాదగిరి ద్వారా రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకున్నాడని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్ రంగంలో దిగిన తరువాత అతని అనుచరులు రామకృష్ణను స్థలం కావాలంటూ బయటకు తీసుకెళ్లి గుండాల మండలం రామారం శివారులో గల తోటలో కిరాతకంగా కొట్టి హత్య చేశారన్నారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామ సమీపంలో పాతిపెట్టారని వివరించారు. 16న జమ్మాపురం సర్పంచ్ అమృతరావును విచారించగా.. వివరాలు బయటపడ్డాయన్నారు. ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అనంతరం బంధువులకు అప్పజెప్పినట్టు తెలిపారు.
ఈ కేసులో యాదగిరిగుట్ట మండలం గౌరవపల్లి గ్రామానికి చెందిన పల్లెపాటి వెంకటేష్, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల యాదగిరి, వలిగొండకు చెందిన దంతూరి రాములు, మోత్కూరు గ్రామానికి చెందిన సయ్యద్ లతీఫ్, సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డినగర్‌కు చెందిన గోలి దివ్య, సిద్దిపేట జిల్లా హిందీనగర్‌కు చెందిన మహమ్మద్ అఫ్సర్, నర్సాపూర్ గ్రామానికి చెందిన పలస మహేష్, మోత్కూర్‌కు చెందిన మహమ్మద్ సిద్ధికి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాష్ నిందితులని చెప్పారు. బొమ్మ పోస్టరు,్ల రెండు కొడవళ్ళు, సుత్తె, రూ.లక్ష, ఇండికా కారు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వివరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, ఇన్చార్జి డీసీపీి యాదగిరి, పర్యవేక్షణలో కేసును ఛేదించినట్టు తెలిపారు. ఇందులో పట్టణ ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారన్నారు.