Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రూప్ ఏర్పాటు ఆవశ్యకత
- స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల మేధో మదన వేదిక
- గ్రూప్ ద్వారా నిరంతర అధ్యయనాలు, సమన్వయ సమీక్షలు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ అంశాలపై చర్చించడం, సెమినార్లు నిర్వహించడం, చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై నిరంతర అధ్యయనాలు చేయడం, సభ్యులతో సమన్వయ సమీక్షలు వంటి పలు విషయాల వేదికగా ఉన్న ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే 'తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రూప్'ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని కొత్తపేటలోగల బాబు జగ్జీవన్ భవన్లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో కలిపి ఓ గ్రూపును చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఆ గ్రూపులో పంచాయతీ రాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, సెమినార్లు జరపడం, అంతర్ జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరపడం ద్వారా అందులో వచ్చే ఫీడ్ బ్యాక్ అంశాలను రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్లమెంటు స్పీకర్ అధ్యక్షులుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటైందనీ, ఈ గ్రూప్ ఏర్పాటుకు ఆద్యులు రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ కావడం విశేషమని తెలిపారు. అన్ని స్థాయిల్లో ఉండే ప్రజాప్రతినిధులు సోషియల్ ఇంజినీర్లు అనీ, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని చెప్పారు. ప్రజా జీవితంలో గెలుపోటములు సాధారణమనీ, రిజర్వేషన్ల వల్ల పోటీ చేసే అవకాశం కొన్ని సార్లు రాకపోవచ్చునప్పటికీ బాధపడొద్దన్నారు. నిరంతరం ప్రజాసేవలో మమేకం కావాలని సూచించారు. స్ధానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు లేవనెత్తిన హెల్త్ కార్డుల మంజూరు, రాయితీపై బస్‌పాస్‌ల జారీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్, ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్ గౌడ్, తులసీ, ప్రమీల, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.