Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజిరెడ్డి, మెండే శ్రీనివాస్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థకు బకాయిపడిన రూ.22 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంస్థకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రతి కార్మికునికి 250 గజాల స్థలం కేటాయించాలని, కార్మికుడు నివసించిన ఇంటిని పదవీ విరమణ అనంతరం వారికే కేటాయించాలన్నారు. మిషన్ భగీరథ మంచి నీటిని కార్మికుల ఇండ్లకు కూడా సరఫరా చేయాలని, కోల్ ఇండియాలో చెల్లిస్తున్న విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఒకటో కేటగిరి వేతనాలు ఇవ్వాలని కోరారు. సింగరేణి సంస్థ అందించే ప్రోత్సాహకాలపై విధిస్తున్న ఆదాయ పన్ను అధికారులకు చెల్లిస్తున్న విధంగా కార్మికులకు కూడా చెల్లించాలని, తదితర 12 డిమాండ్లతో నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. ఇటీవల పలు దఫాలుగా కార్మిక సంఘాలకు యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలలో అవగాహన కుదిరిన డిమాండ్లను తక్షణమే లిఖితపూర్వక ఒప్పందం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘానికి లబ్ధి కలిగించే విధంగా చర్చలను వాయిదా వేసినా, తక్షణమే కార్మిక సంఘాలతో ఒక అవగాహనకు రాని ఎడల మరో సమ్మె తప్పదని వారు హెచ్చరించారు. ఈ నెల 19న హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్తో త్రైపాక్షిక సమావేశం జరుగుతున్నట్టు తెలిపారు. బెల్లంపల్లి, కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లి రీజి యన్లలో సమావేశాలు, కార్మిక సదస్సులు ఏర్పాటు చేశారు. కరపత్రాలు, వాల్ పోస్టర్స్ ద్వారా కార్మికులను నేరుగా కలుసుకుని పోరాటానికి మద్దతు కోరారు.