Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ హెరిటేజ్ డే సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారసత్వ సంపదను కాపాడుకోవాలని పలువురు వక్తలు సూచించారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లో ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తాధ్వర్యంలో తెలంగాణలో పురావస్తు, సంస్కృతి, వారసత్వం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఉదయం జరిగిన సెషన్‌కు ఏఎస్ఐ సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత ఎస్.కుమార్ అధ్యక్షత వహించగా, డక్కన్ ఫిరంగులు -నిర్లక్ష్యం చేయబడ్డ అందాలు అనే అంశంపై భవన్స్ న్యూసైన్స్ కాలేజ్ చైర్మెన్ మెటలర్జిస్ట్ డాక్టర్ ఎస్.జైకిషన్ వివరించారు. దేశవ్యాప్తంగా రకరకాల ఫిరంగులు ఉన్నాయని తెలిపారు. వీటిలో అన్ని రకాల లోహాలతో చేసిన ఫిరంగులు ప్రత్యేకంగా గత చరిత్రను చెబుతుంటాయని వివరించారు. ఫిరంగుల తయారీ, వాటి వినియోగం తదితర అంశాలను సోదాహరణంగా తెలిపారు. బీజాపూర్, గుల్బర్గా, బీదర్‌తో పాటు హైదరాబాద్, జగిత్యాల తదితర చోట్ల ఫిరంగులు ఎక్కువగా కనిపించేవన్నారు. అయితే వాటి పరిరక్షణ పట్ల కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు శ్రద్ధ చూపించకపోవడంతో కనిపించకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.