Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు తీవ్రమవుతున్నాయనీ, ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షులు బండి సంజరుపై దాడి అందులో భాగంగానే జరిగిందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత నేత రాజాసింగ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే అలంపూర్ నియోజకవర్గంలోని వేములలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, బండి సంజరు కుమార్, తదితరులపై టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు సరిగాదని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ దివాళాకోరుతనానికి ఇది నిదర్శనమని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యాత్ర సాఫీగా సాగేందుకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.