Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- జైనలో అత్యధికంగా 44.2 డిగ్రీలు
- పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రంలో పలు జిల్లాలో ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 44.2 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ నెలలో ఇదే అత్యధికం. వచ్చే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎండలు మరింత పెరిగే అవకాశముంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.మరోవైపు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. పలుచోట్ల ఈదురు గాలులు(గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) వీయొచ్చనీ, అక్కడక్కడా ఉరుములు, మెరు పులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొన్నారు. దక్షిణ, నైరుతి దిశల మీదుగా రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సొసైటీ నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్లో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో 1.9 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 1.73 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. రాష్ట్రంలో మొత్తంమీద 28 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, షేక్‌పేట, రామచంద్రాపురం, తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది.