Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్కు కేటీఆర్ హితవు
- అక్కడ బీజేపీది అసమర్థ పాలనంటూ విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రజా సంగ్రామం పేరిట తెలంగాణలో పాదయాత్రలు చేయటం కాదు.. మీ పార్టీ పాలనలో ఉన్న కర్నాటకలో పాదయాత్రలు చేయండి... అక్కడి సమస్యలను పరిష్కరించండి...' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరునుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్నాటకలో బీజేపీ అసమర్థ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక వేడుకలకు వేదికైన హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సోమవారం పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎమ్సీ అధికారులు, నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ పాలన, ఇక్కడి సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ బీజేపీకి చెందిన రాయచూర్ ఎమ్మెల్యే గతంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆయన్ను ఒక్కసారి కలిసి రావాలంటూ సంజరుకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదనీ, నదీ జలాల్లో వాటా తేల్చలేదనీ, గద్వాల నుంచి మాచర్ల వరకూ రైల్వే లైను వేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. వీటిని పట్టించుకోని కేంద్రం తీరుకు నిరసనగా పాదయాత్ర చేయాలంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ చెబుతున్న సంజరుకు.. ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో తెలియదా..? అని ప్రశ్నించారు. మోడీ సర్కారు వాటిని ఉచితంగా అందిస్తామంటే ఎవరన్నా అడ్డుకుంటారా..? అని నిలదీశారు.
పలు కమిటీల ఏర్పాటు...
టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహణ కోసం పలు కమిటీలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం అలంకరణ, ప్రతినిధుల నమోదు, వాలంటీర్లు, పార్కింగ్, ప్రతినిధుల భోజనం, తీర్మానాలు, మీడియా కమిటీలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.