Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలకు గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్ర సదస్సు హెచ్చరిక
- 21న జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గ్రామీణ ఉపాధి హామీ చట్టం జోలికి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి గుణపాఠం చెప్తామని ఏడు కార్మిక సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ పథకాన్ని పట్టణాలకూ విస్తరింపచేయాలనీ, నిధుల కేటాయింపు పెంచాలనీ డిమాండ్ చేసింది. ఏడు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'గ్రామీణ ఉపాధి హామీ రక్షణ' అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు బీ ప్రసాద్, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎమ్యూ) రాష్ట్ర అధ్యక్షులు కే కాంతయ్య అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, రాష్ట్ర అధ్యక్షులు జీ నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ పద్మ, బీకేఎమ్యూ జాతీయ నాయకులు తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేష్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ నాయకులు శంకర్, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ (పీఎమ్సీ) నాయకులు శివలింగం, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారులు యూనియన్ (టీవీవీయూ) నాయకులు వెంకటయ్య, దళిత బహుజన శ్రామిక యూనియన్ (డీబీఎస్యూ) నాయకులు రమేష్, నేషనల్ అగ్రికల్చర్ పీపుల్స్ మోనిటరింగ్ (ఎన్ఏపీఎమ్) నాయకులు ఎమ్ సంఘమిత్ర, పద్మ, కల్పన, బూదమ్మ తదితరులు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని మార్చే అధికారం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి లేదనీ, దాన్ని కమ్యూనిస్టుల పోరాటంతో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకానికి నిధులు తగ్గించి, గ్రామీణ ఉపాధి అవకాశాలను మోడీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బకొట్టిందని విమర్శించారు. ఉపాధిహామీని కూలీలకు కాకుండా కాంట్రాక్టర్లకు పనికొచ్చేలా మార్పులు చేసే కుట్రల్ని కేంద్రం చేస్తున్నదని చెప్పారు. యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యల్ని తిప్పికొడతామని హెచ్చరించారు. దళితులు, గిరిజనులు, బీసీలు ఈ స్కీం ద్వారా లబ్దిపొందుతున్నారనీ, వారిలోనూ 54 శాతం మంది మహిళలే ఉన్నారని గణాంకాలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుపై కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదనీ, బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో పట్టణాల్లో పనికల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. అరకొర కూలీలు ఇస్తూ, నడివేసవిలో రెండుపూటలా ఫోటోలు, సంతకాలు పెట్టాలంటే కుదరదని తేల్చిచెప్పారు. కూలీలే పనికి రావట్లేదనే ప్రచారం చేసేందుకే కేంద్రం ఈ తరహా నిబంధనలు పెడుతున్నదని వివరించారు. 'ఊరికో కోడి-ఇంటికో ఈక' అన్నట్టు ఈ పథకానికి నిధుల కేటా యింపు ఉన్నదని ఎద్దేవా చేశారు. పోరాడితేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందనీ, తల్లి కూడా పోరాడే బిడ్డలకు జన్మనిస్తుందనీ, అదే చైతన్యం ప్రజల్లో కలగాలని పిలుపునిచ్చారు. వేసవికాలంలో కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించారు. పని ప్రదేశంలో నీడ, నీళ్లు కల్పించకుండా నానా అవస్థలు పెడుతున్నారనీ, కూలీలు నీడకోసం మట్టిదిబ్బల కిందకు వెళ్లి మృత్యువాత పడుతున్నారంటూ పలు ఉదాహరణలు వివరించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు కూలి రేట్లు పెంచా లని కోరారు. అంతకుముందు ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు 'ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఏప్రిల్ 21న జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలి' అనే అంశంపై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిలో ఏడు డిమాండ్లతోపాటు పలు అంశాలను ప్రస్తావిం చారు. ఈ తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.