Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే నెలాఖరుకి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలి
- జీవ, పశు ఎరువులపై దృష్టి సారించాలి
- భూసార పరీక్షలు తప్పనిసరి
- ఎరువులపై సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి రాష్ట్రాలకు ఎరువుల సరఫరాలో కేంద్రం జాప్యం చేస్తున్నదనీ, ఇది ఏమాత్రం సముచితం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మోడీసర్కారుకు హితవు పలికారు. మే నెలాఖరు వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో మంత్రితోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎరువుల విభాగం ఉన్నతాధికారి రాములు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ..రాష్ట్రానికి 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓపీ, ఎస్ఎస్పీ ఇవ్వడానికి కేంద్ర ఎరువులు, రసాయనశాఖ ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్దంచేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సీజన్ ముందే ప్రారంభమ వుతుందనీ,పక్కా ప్రణాళికతో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కోసం కేంద్ర ఎరువులు, రసాయన శాఖకు లేఖ రాశామని తెలిపారు. వివిధ పోర్టుల్లో అందుబా టులో ఉన్న డీఏపీ, కాంప్లెక్సు ఎరువులను తెలంగాణకు పంపించాలని విన్నవించారు. రైతులు మూస పద్ధతిలో కాకుండా పంటకు అవసరమైన మేరకు, నేలలో పోషకాల లభ్యతను బట్టి ఎరువులను వాడాలని సూచించారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నేల ఆరోగ్యం మీద రైతులు శ్రద్ధపెట్టాలనీ, ప్రభుత్వం అందించే పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలని సూచించారు. నేలలో తగినంత సేంద్రీయ కర్బనం లేనిదే ఎన్ని ఎరువులు వాడినా ప్రయోజనం ఉండదన్నారు. అవసరం లేని రసాయన ఎరువులు వాడటం వల్ల పంట పెట్టుబడి పెరిగి, నేల ఆరోగ్యం క్షీణించి పంట దిగుబడి తగ్గుతుందని హెచ్చరించారు. జీవ ఎరువులు, పశువుల ఎరువులు విరివిగా వాడాలని కోరారు. సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించడంలో ఎరువుల కంపెనీలు భాద్యత తీసుకోవాలని సూచించారు. మే నెలలో క్షేత్రస్థాయిలో అధికారుందరూ రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.