Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కుల దురహంకార హత్యలు
- నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు
- సామాజిక,వర్గ ప్రజాసంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన కుల దురహంకార హత్యపై తగిన విచారణ చేసి, తక్షణమే దోషులకు శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలనీ, వారిని కఠినంగా శిక్షించాలని సామాజిక, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సంఘటనను నిరసిస్తూమంగళ, బుధవారాల్లో జరిగే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో సామాజిక, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ ఎక్కువ కులం, తక్కువ కులం అంటూ ఉన్మాదంతో వ్యవహరించటం అజ్ఞానమని చెప్పారు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్‌ను సొంత మామ వెంకటేష్ రూ. 10 లక్షలు సుపారి ఇచ్చి చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఈ సంఘటన పట్ల యావత్ సమాజం స్పందించి ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యం వల్లనే భువనగిరి ప్రాంతంలో యదేచ్ఛగా కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. గత ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో 70 కి పైగా ఇలాంటి హత్యలు జరిగాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు మనువాద భావజాలాన్ని ప్రజల్లో వ్యాపింపజేసి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. మరోవైపు చినజీయర్ స్వామి లాంటి వారు కులం పోకూడదనీ, ఏ కులం పని ఆ కులం చేయాలని ప్రచారం చేయడం వల్లనే కులోన్మాదం మరింత పెరిగి ఇవి కొనసాగుతున్నాయని విమర్శించారు. ఆంబోజీ నరేష్, మధుకర్ ,ప్రణరు లను హత్య చేసిన నిందితులను సమర్ధి స్తూ ఆనాడు బీజేపీ అనుబంధ సంస్థలు ర్యాలీలు కూడా చేశాయని గుర్తు చేశారు. కుల దురహంకార హత్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అతి కిరాతకంగా హత్య చేయించిన వెంకటేష్‌ను, హత్యకు పాల్పడిన హంతకులను కఠినంగా శిక్షించాలని ,అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి .నాగయ్య, ఆర్. వెంకట్ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీపీఎస్కే రాష్ట్ర నాయకులు జి. రాములు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీ రామ్ నాయక్, డీబీఎఫ్˜్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్, భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్ రాములు, కాంతయ్య, బాల మల్లేష్. పీఎంసీ రాష్ట్ర కోఆర్డినేటర్ శివలింగం, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి అబ్బాస్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, వెంకటేష్ ,విజరు, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్, మహేందర్, కిరణ్, ఎన్ఏపీఎం రాష్ట్ర నాయకులు మీరా సంఘమిత్ర, ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.