Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణ కోసం చట్టం తేవాలి
- తల్లిదండ్రుల డిమాండ్
- పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలని కోరారు. వాటిని తగ్గించాలని కోరుతూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ), తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్టీసీఈఏ), అమ్మల సంఘం (ఎంఏ), బాలల హక్కుల రక్షణ ఫోరం (సీఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 'ఫీజుల దోపిడీని అరికట్టాలి, ఫీజులుం నశించాలి, ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీపీఏ అధ్యక్షులు ఎన్ నారాయణ మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా ఫీజుల దోపిడీని అరికట్టాలనీ, వాటి నియంత్రణకు చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని విమర్శించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజుల నియంత్రణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందని గుర్తు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తెస్తామంటూ నమ్మించారని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం తూతూమంత్రంగా పనిచేస్తున్నదని విమర్శించారు. కొత్త విద్యాసంవత్సరం రాబోతున్నా ఫీజుల నియంత్రణ చట్టం తేలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచాయని అన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టాలు అమలవుతుంటే రాష్ట్రంలో ఆ చట్టం ఊసే లేకపోవడం అన్యాయమని విమర్శించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫీజులు చెల్లించని విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదనీ, హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. యాజమాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని అన్నారు. తెలంగాణ వస్తే కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రిస్తామంటూ చెప్పిన పాలకులు అధికారంలోకి వచ్చాక వాటికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలనీ, చట్టం తేవాలనీ, విద్యాహక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మల సంఘం అధ్యక్షులు జి భాగ్యలక్ష్మి, సీఆర్పీఎఫ్ కన్వీనర్ జి వేణుగోపాల్, తెలంగాణ ప్రయివేట్ టీచర్ల ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అధ్యక్షులు షబ్బీర్‌అలీ, తల్లిదండ్రులు వి విజరుకుమార్, పురుషోత్తం, మల్లేష్, నర్సిరెడ్డి, అశోక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.