Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత స్థలముంటే మూడు విడతల్లో సొమ్ము
- ఎంత భూమి ఉండాలనే విషయమై తర్జనభర్జన
- మార్గదర్శకాల తయారీలో సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సొంత స్థలమున్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు రూ. మూడు లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో జూన్ నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసే పనిలో సర్కారు నిమగమైంది. జూన్ నుంచి ఈ పథకాన్ని వేగంగా అమలుచేయాలని భావిస్తున్నది. మొదటి విడత ఆర్థిక సాయాన్ని సైతం ఇదే ఆర్థిక సంవత్సరంలో వారి ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈనేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపిక, ఎన్ని గజాల స్థలం ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయాలి ? రూ. మూడు లోల ఆర్థిక సాయాన్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనే విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు .త్వరలోనే విధానం ఖరారు కానుంది.
ఎంత భూమి ఉండాలి ?
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారుడికి ఎంత భూమి ఉండాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కనిష్టంగా 100 గజాలు, గరిష్టంగా 330 గజాలకుపైగా సొంతజాగా కలిగి ఉన్న వారిని అర్హులుగా నిబంధనలు రూపొందించాలని తొలుత అధికారులు భావించారు. కాగా, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో 330 చదరపు అడుగుల భూమి నిరుపేదల దగ్గర ఉంటుందా ? అనే విషయమై అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ నిబంధనలు అమలుచేస్తే చాలామంది పేదలకు నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 330 చదరపు గజాల సొంత స్థలం కలిగి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం కోసం ఎదరుచూసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని అంచనా. ఎక్కువ మంది పేద ప్రజానీకం 100 నుంచి 300 లోపు చదరపు అడుగుల స్థలమున్న వారు ఉంటారని భావిస్తున్నారు. అలాగే 150 చదరపు అడుగుల్లోపు ఉన్నవానికి పథకం అమలుచేయాలని చర్చ జరిగినట్టు తెలిసింది. రూ. మూడు లక్షల ఆర్థికసాయాన్ని ఒకేసారి కాకుండా విడతలవారీగా సాయం చేసేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం చేయడంతో నుంచి ఆదేశాలు రావడంతో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించి పునాదులు వేసి పిల్లర్ల వరకు నిర్మిస్తే మొదటివిడతలో భాగంగా రూ.లక్ష ఆర్థికసాయం, రెండో విడతలో గోడలు పూర్తిస్థాయిలో కడితే(పైకప్పు) మరో రూ. లక్ష, మూడతలో స్లాబు వేసి గోడలకు ఫినిషింగ్ చేసి, రంగులు వేస్తే ఇంకో రూ. లక్ష సాయం చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. లబ్ధిదారుల ఎంపిక కూడా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో కలెక్టర్, ఎమ్మార్వోలు చేయిస్తారనే చర్చ ప్రభుత్వంలో జరుగుతున్నది. అంతేకాకుండా ఆ ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేసేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలిసింది.
వీలైనంత ఎక్కువ మందికి సాయం !
2014 ఎన్నికల సమయంలో పేదలకు డబుల్బెడ్రూం పథకాన్ని ప్రకటించగా, కాగా ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి నిధులు భారీస్థాయిలో ఖర్చవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన పేరుతో డబుల్బెడ్రూం పథకం కింద కట్టిన ఇండ్లకు కూడా నిధులు ఆపేయడంతో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా ? అనే అంశంపై సమాలోచన చేస్తున్నది. ఈ మూడు లక్షల పథకంలో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన పథకం నిధులు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ఇండ్ల నిర్మాణానికే రూ. 12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ఈ నేపథ్యంలో రూ. మూడు లక్షల ఇండ్ల పథకానికి భారీస్థాయిలోనే ఖర్చుచేయనుందని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్యను పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. తక్కువ నిధులు, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే, తమకు ఈ పథకం ద్వారా మంచిపేరు వస్తుందనేది సర్కారు అభిప్రాయంగా ఉన్నట్టు అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.