Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మరువకముందే మరో ఘటన..
- ఆందోళనలో తల్లిదండ్రులు
- ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి: ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ- దామరచర్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం రేపాయి. ఆదివారం రాత్రి హాస్టల్లో నిద్రపోతున్న ఇద్దరు విద్యార్థినుల కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికి గాయపర్చాయి. విద్యార్థినులకు పాఠశాలలోనే ప్రథమ చికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. ఇదే పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మరువకముందే మరో ఘటన జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సందర్భంగా.. పుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విచారణ జరిపేందుకు సోమవారం పాఠశాలకు వచ్చిన డీటీడీఓ, ఆర్సీఓ అధికారులను ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో విద్యార్థులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ మాట్లాడుతూ.. దామరచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో వరుసగా సంఘటనలు జరుగుతున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని వాపోయారు. కుళ్ళిపోయిన కూరగాయలు, పురుగుల బియ్యం విద్యార్థులకు వండిపెడుతుండటంతో ఫుడ్ పాయిజన్ అయి వరుసగా రెండు రోజులు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు గిరిజనులపై పక్షపాతం వహిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఎలుకలు ఎక్కువయ్యాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ జగన్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, అయ్యప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.