Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారువి తిరోగమన విధానాలు
- సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
- ఎరువుల నిల్వలపై ఆరా ొ విచ్చలవిడి డీఏపీ వాడకం తగదు
- కల్తీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో వ్యవసాయరంగం కుదేలైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి బీజేపీవి తిరోగమన విధానాలని విమర్శించారు. రైతుల్ని ప్రోత్సహించటానికి బదులుగా... వారిని నిరుత్సాహ పరుస్తున్నారని తెలిపారు. పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుం డా వాటి ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో వ్యవసాయరంగం కీలకంగా మారిందని తెలిపారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నదనీ, తమ ప్రభుత్వం చేపట్టిన మిగతా ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలో పూర్తవుతాయని స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్... ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ పురోగతిపై ఆయన ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై జాబ్ చార్ట్ తయారు చేయాలని ఆదేశించారు. వానాకాలం సీజన్ ప్రారంభంలోపే అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చుకోవాలని సూచించారు. కల్తీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి... జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక(డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్)ను రూపొందించాలని కోరారు. ఈ ప్రక్రియలో కలెక్టర్లు, ఆర్డీవోలను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. యూరియా, ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ వాటిని తగు మోతాదులో వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పంటల మార్పిడి ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవటం తక్షణావసరమని నొక్కి చెప్పారు. ఈ దిశగా తగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మారుతున్న కాలాన్నిబట్టి ఎరువులను ఎలా వాడాలనే విషయమై రైతు వేదికల ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డీఏపీ, ఎరువులు, యూరియా తదితర నిల్వలపై సీఎం ఈ సందర్భంగా ఆరా తీశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ఎరువుల లభ్యత అవసరానికి మించి ఉండబోదని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ పత్తికి డిమాండ్ పెరుగుతున్న అంశంపై కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ఆ పంట సాగును మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. మిర్చికి కూడా ఊహించని రీతిలో క్వింటాల్‌కు రూ.42 వేలకు పైగా ధర పలుకుతున్నదని చెప్పారు. కందికి సైతం మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న నేపథ్యంలో... ఆ పంటకు సంబంధించి వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. పొద్దు తిరుగుడు విస్తీర్ణాన్ని కూడా పెంచాలన్నారు. కల్తీ విత్తన తయారీదారులను కట్టడి చేసేందుకు వీలుగా పోలీసు యంత్రాంగం సహాయ, సహకారాలను తీసుకోవాలనీ, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఇప్పటి నుంచే రంగంలోకి దించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ వేగం పుంజుకున్నదని మార్కెటింగ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితరాలను సమకూర్చుకున్నామని సీఎంకు వివరించారు. మొత్తం 6,983 కేంద్రాలను ఏర్పాటు చేయగా... ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. వాటిలో ఇప్పటికే 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలైందనీ, 1,200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్తోపాటు వ్యవసాయ, పౌరసరఫరాలశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.