Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దామరచర్ల గిరిజన బాలికల పాఠశాలలో ఘటన
నవ తెలంగాణ-దామరచర్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో తాజాగా మరో ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మూడ్రోజులు వ్యవధిలో 50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. దీంతో పాఠశాల నిర్వహణపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాత్రి ఎనివిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని మిర్యాలగూడ ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, ప్రిన్సిపల్ పుష్పలతను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.
బాధ్యుల పై చర్యలు
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
గురుకుల పాఠశాలలో ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. దామరచర్లలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినుల అస్వస్థత, ఎలుకల దాడిలో విద్యార్థినులకు గాయాలు వంటి వరుస ఘటనల విషయంలో ప్రిన్సిపాల్, ఏఎన్ఎంల నిర్లక్ష్యం ఉన్నట్టు కనిపించిందని చెప్పారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బియ్యాన్ని కూడా ప్రస్తుతం మార్చినట్టు చెప్పారు. మార్చిన బియ్యం బాగున్నట్టు విద్యార్థినులు చెప్తున్నందున వీటినే కొనసాగించనున్నట్టు తెలిపారు. బాత్రూమ్లకు డోర్లు బిగించడం, శానిటేషన్ మరమ్మతులు చేయిస్తామన్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తాగునీటి విషయంలో సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎలుకల సమస్య పరిష్కారం కోసం క్లినింగ్, గుంతలు పూడిపిస్తామన్నారు. విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాల కుక్ అలీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అన్ని వేళలా తాము తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ఆయన వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండలరావు, ఆర్డీవో రోహిత్ సింగ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎస్ఐ రవికుమార్ ఉన్నారు.
సమస్యలు ఏకరువు
నాసిరకం బియ్యం, వాడిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నట్టు పలు విద్యార్థి సంఘాల నాయకులు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. బాత్రూంలకు డోర్లు లేని కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. శుభ్రం చేయించక పోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోందన్నారు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. కుక్‌గా పనిచేసే వ్యక్తి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వినోద్, ఎరా నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు సైదానాయక్, వీరన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.