Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిని ధ్వంసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- సింగరేణి వ్యాప్తంగా ఒక్కరోజు నిరాహార దీక్షలు
- సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తు ఉద్యమాలకు
సిద్ధం: బి.మధు
నవతెలంగాణ- కొత్తగూడెం
సింగరేణి సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని, రాష్ట్రంలో సంస్థ పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ, దాన్ని రక్షించుకో వాలంటే పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చి సంస్థను రక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని సింగరేణి వ్యాప్తంగా మంగళవారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ), కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సింగరేణి కోల్‌బెల్ట్ 11 ఏరియాల్లోని జీఎం కార్యాలయాల ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కొత్తగూడెంలో చేపట్టిన దీక్షలో కూర్చున్న మధు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండూ దొంగల్లా దోచుకుంటూ సింగరేణి సంస్థ మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చారని ఆరోపించారు. 2014 నుంచి 2020 వరకు 21 రకాల పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి సంస్థ రూ. 32 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) పేరుతో సింగరేణి ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో రూ.2700 కోట్లు డిపాజిట్ చేసిందని గుర్తుచేశారు. కార్మికులు ఏడాదికి రూ.300 కోట్లు ఇన్‌కంట్యాక్స్ చెల్లిస్తున్నారని తెలిపారు. ఇలా అనేక రూపాల్లో సింగరేణి చెల్లిస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. వివిధ విద్యుత్ సంస్థలు సింగరేణికి రూ.22 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గతేడాది డిసెంబర్లో పర్మినెంట్ కార్మికుల సమస్యలు ఆర్ఎల్సీ ముందు ఉంచుతున్నా పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. సింగరేణి సంస్థ రక్షణకు, పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ముందుగా ఈ దీక్షలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ మధుకి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం సింగరేణి డిప్యూటీ పర్సనల్ (వెల్ఫేర్) డి.శ్రీనివాస్‌రావుకి నాయకులు మెమోరాండం అందజేశారు. ఈ దీక్షలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవీ అప్పారావు, ఐలూ రాష్ట్ర నాయకులు రమేష్ కుమార్ మక్కడ్, డీవైఎఫ్ఐ, అంగన్వాడీ యూనియన్, మున్సిపల్ కార్మికులు తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్షలో బ్రాంచి అధ్యక్షులు గాజుల రాజారావు, వై. వెంకటేశ్వరరావు, కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగాని కృష్ణయ్య, కర్ల వీరస్వామి, కన్విన్స్ డ్రైవర్స్ శ్యామ్, సూరం అయిలయ్య, ఎలగొండ శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి రామగుండం రీజియన్‌లోని ఆర్జీ-1 జీఎం కార్యాలయాల ఎదుట సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షలో ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఆర్జీ-3 ఏరియాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు పాల్గొని మాట్లాడారు. సీఎం చేసిన వాగ్దానం మేరకు బినామీ పేర్ల మార్పు, సొంతింటి పథకం అమలు, డిపెండెంట్ల వయస్సు పెంచడం అమలుచేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు 22 జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం, అలవెన్సులపై ఇన్‌కంటాక్స్ తిరిగి చెల్లించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ.22 వేల కోట్లు సంస్థకు ఇవ్వాలని, కార్మికుల కాలనీలకు మిషన్ భగీరథ మంచినీరు తక్షణమే అందించాలని, కాలం చెల్లిన క్వాటర్స్ కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ క్వాటర్స్ నిర్మించాలని కోరారు. డ్రైనేజీ రిపేరు రోడ్లు తదితర సమస్యలు పరిష్కారం కోరుతూ ఆర్ఎల్సీ వద్ద చర్చలు జరుగుతున్న సందర్భంగా యజమాన్యం తక్షణమే అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి జీఎం ఆఫీసు ఎదుట సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్.వెంకటస్వామి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. దీక్షలను మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని యూనియన్లు కలిసి డిసెంబర్లో 12 డిమాండ్లపై సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి సింగరేణి వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నామని తెలిపారు. బెల్లంపల్లి జీఎం కార్యాలయం ఎదుట ఒక్క రోజు దీక్ష చేపట్టారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య ప్రారంభించారు.