Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర నాయకురాలిగా బాధ్యతలు
- కేఎల్ సతీమణిగా విప్లవోద్యమాల నిర్మాణం
- మహిళా రాజకీయ పాఠశాలల నిర్వహణ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం సంతాపం
- నేడు మధ్యాహ్నం ఖమ్మం సీపీఐ(ఎం) కార్యాలయానికి భౌతికకాయం
నవతెలంగాణ- ఖమ్మం
ఐద్వా రాష్ట్ర సీనియర్ నాయకులు కొండపల్లి దుర్గాదేవి(89) మంగళవారం కన్నుమూశారు. దుర్గాదేవి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ నాయకులు కేఎల్ నర్సింహారావు సతీమణి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దుర్గాదేవి మృతిపట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గం సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంచనున్నట్టు దుర్గాదేవి కుటుంబసభ్యులు తెలిపారు. అక్కడ్నుంచి భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయానికి తీసుకొస్తారు. ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమవుతాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.
మహిళా ఉద్యమంలో దుర్గాదేవి..
దుర్గాదేవి ఏప్రిల్ 10, 1933లో జన్మించారు. ఆమె తండ్రి నేదునూరి రాఘవరావు స్వాతంత్య్ర ఉద్యమంలో పనిచేశారు. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం. మొట్టమొదటి కమ్యూనిస్టు రాజకీయ పాఠశాల రాఘవరావు ఇంట్లో, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి రామనాథం, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, రావినారాయణరెడ్డి వంటి సాయుధ పోరాట నేతలు హాజరయ్యారు. తన సమీప బంధువు కొండపల్లి లక్ష్మీనర్సింహారావుతో దుర్గాదేవికి 14 ఏండ్ల వయస్సులో 1949లో విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వివాహం జరిగింది. 1954లో ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర మహిళా సంఘంలో పనిచేశారు. భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చిన తర్వాత తొలిసారి సీపీఐ(ఎం) ప్లీనం కేఎల్ దుర్గాదేవి ఇంట్లోనే నిర్వహించారు. మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం స్ఫూర్తితో 1972లో బయ్యారం మండలం సత్యనారాయణపురంలో మహిళా రాజకీయ పాఠశాలను దుర్గాదేవి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. 1974లో మహిళా సంఘం పునరుద్ధరణలో భాగంగా ఖమ్మంలో రాష్ట్ర మహిళా మహాసభ ఏర్పాటు చేశారు. ఆ మహాసభలో మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా దుర్గాదేవి ఎన్నికయ్యారు. నాటి నుంచి ఐద్వా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా, పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. దుర్గాదేవి, కేఎల్ నర్సింహారావు దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు కొండపల్లి ఉత్తమ్‌కుమార్, చిన్న కుమారుడు కొండపల్లి పావన్, కుమార్తె కొమరవెల్లి సుధా. అందరూ ఉన్నత విద్యలు అభ్యసించారు. వీరిలో ఉత్తమ్‌కుమార్ ప్రముఖ న్యాయవాది, గతేడాది మృతిచెందారు. 2015లో కుమార్తె సుధా చనిపోయారు. దుర్గాదేవి తమ పిల్లలను సైతం కమ్యూనిస్టు బాటలోనే నడిపించారు. పీడిత ప్రజల సేవలోనే కుటుంబమంతా కొనసాగుతోంది.
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంతాపం
ఐద్వా రాష్ట్ర నాయకులు కొండపల్లి దుర్గాదేవి మృతి పట్ల సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం, కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. పార్టీ ఖమ్మం జిల్లా నాయకురాలిగా మహిళా ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన గొప్ప పోరాట యోధురాలని నేతలు గుర్తు చేశారు. ఆమె మరణం పార్టీకి, మహిళా సంఘానికి తీరని లోటని, ఆమె ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. తుదిశ్వాస వరకు పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు.
ఐద్వా సంతాపం
ఐద్వా సీనియర్ నాయకురాలు, ఖమ్మం జిల్లా మహిళా సంఘం నిర్మాత కొండపల్లి దుర్గాదేవి మరణం పట్ల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, కార్యదర్శి మల్లు లక్ష్మి, జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి, సీనియర్ నాయకులు పుతుంబాక భారతి, అల్లూరి మన్మోహిని, టి జ్యోతి, బి హైమావతి, కెఎన్ ఆశాలత, డి ఇందిరా, బి సరళ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మియాపూర్ సుగుణ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.