Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వసతులు బాగున్న స్కూల్స్‌లోనే మళ్లీ సౌకర్యాలు!
- రూ.15 లక్షలలోపు అవసరమయ్యే స్కూల్స్‌కే తొలి ప్రాధాన్యం
- మండలానికి రెండేసి స్కూల్స్ ఎంపిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యా, వైద్యరంగాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన 'మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి' పథకం మొక్కబడిగా సాగుతోంది. ఈనెల 9వ తేదీ నుంచి ఈ పథకానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. మంత్రులందరూ తమతమ నియోజకవర్గాల్లో పనులు ప్రారంభించారు. పదిరోజులకు పైగా అవుతున్నా ఇంతవరకూ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కనీసం ఏ పాఠశాలకు ఎన్నేసి నిధులు కేటాయించారో కూడా అధికారులు అంచనాకు రాలేకపోతుండటంతో ఇదో మొక్కుబడి పథకంగానే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 12 రకాల వసతులు ఆయా పాఠశాలల్లో కల్పించాలని నిర్దేశించారు. మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో జూన్‌లో తిరిగి పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పథకాన్ని ప్రారంభించి పదిరోజులవుతున్నా ఇంకా పలుచోట్ల ఆవిష్కరణలే కొనసాగుతున్న దృష్ట్యా సకాలంలో పనులు పూర్తవడం అసంభవమేనని అర్థమవుతోంది.
మొదలవని పనులు...
ఖమ్మం జిల్లాలో మొత్తం 1,215 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో 426 స్కూల్స్‌ను మొదటి దశలో ఎంపిక చేశారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు మండలానికి రెండు పాఠశాలలను గుర్తించారు. గరిష్ట విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి రూ.15లక్షలలోపు నిధులయ్యే పాఠశాలలను ఈ దఫా ఎంపిక చేశారు. ఈ నిధుల ద్వారా పాఠశాల భవనాల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, భవనాలకు రంగులు, ప్రహరీ గోడలు, కిచెన్, డైనింగ్ హాల్స్ నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో నూతన గదులు, డిజిటల్ విద్యా పరికరాల కల్పన వంటి పనులు చేస్తారు. కానీ ఇంతవరకూ వీటిలో ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు. ఇంకా అంచనాల దగ్గరే అధికారులుండటం గమనార్హం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు (ఎస్ఎంసీ) ఈ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. పూర్వ విద్యార్థులు, ఇతరత్ర దాతలు ముందుకొస్తే వారి పేర్లను ఆయా క్లాస్ రూమ్‌లు, పాఠశాల భవనానికి పెడతారు. కానీ జిల్లాలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎస్ఎంసీ చైర్మెన్, హెడ్మాస్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, మేయర్/ మున్సిపల్ చైర్మెన్/ సర్పంచ్ సమన్వయంతో ఈ పనులు నిర్వహిస్తారు. వీరిలో ఎస్ఎంసీ చైర్మెన్, హెచ్ఎం పేరుతో ఖాతా తెరుస్తారు. కానీ పనుల ప్రారంభ దిశగా పూర్తిస్థాయి ప్రయత్నాలు ఇంకా ఏ పాఠశాలలోనూ సాగుతున్నట్టు కనిపించడం లేదు.
తక్కువ బడ్జెట్ స్కూల్స్‌కే తొలి ప్రాధాన్యం
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ఎంపిక చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్టంగా విద్యార్థులున్న స్కూల్స్‌ను తొలి విడత ఎంపిక చేశామంటున్నారు. కానీ తక్కువ బడ్జెట్ అయ్యే స్కూల్స్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థమవుతోంది. ఉన్నంతలో వసతులు బాగున్న స్కూల్స్‌ను ఎంపిక చేశారనే విమర్శ ఉంది. వాటికి కాస్త మెరుగులు దిద్ది.. మెజార్టీ స్కూల్స్‌లో సౌకర్యాలు కల్పించినట్టు లెక్కలు చూపించుకునే యత్నాలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి దశలో పనులు నిర్వహించే పాఠశాలలకు ప్రభుత్వం కేవలం రూ.2 కోట్ల నిధులు మాత్రమే కేటాయించి.. తొలి దశలోనే 60శాతం విద్యార్థులు కవర్ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతోంది.
వసతులు బాగున్నా...
కార్పొరేట్ స్కూల్స్‌ను తలపించే ఖమ్మంలోని రోటరీనగర్ పాఠశాల 'మన బస్తీ-మన బడి' కార్యక్రమానికి ఎంపికైంది. ఈ స్కూల్ నుంచే ఈ పథకానికి జిల్లా మంత్రి అజరు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఈ పాఠశాలలో వసతులు చాలా వరకూ మెరుగ్గా, భవనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేరు. విద్యార్థులు 270 మంది వరకు ఉన్న హైస్కూల్‌కు కనీసం అటెండర్, శానిటరీ వర్కర్ సైతం లేరు. సిబ్బంది కొరత వెంటాడుతున్నా వసతులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అటువంటి రోటరీనగర్ పాఠశాలను తొలి దశలో ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
అంచనాలు సిద్ధం చేస్తున్నాం
గరిష్ట సంఖ్యలో విద్యార్థులు కవరయ్యేలా తొలి దశ పాఠశాలలు ఎంపిక చేశాం. ఈ విడత దాదాపు 60శాతం మంది విద్యార్థులు కవర్ అవుతున్నారు. జిల్లాలో 426 పాఠశాలల్లో పథకాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఆయా పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తదనుగుణంగా నిధులు మంజూరు చేసి పనులు చేపడతాం.
- యాదయ్య, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి
సౌకర్యాలు మరింతగా మెరుగుపరుస్తాం
మనబస్తీ- మనబడి పథకాన్ని ఉపయోగించుకుని పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం. కాంపౌండ్ వాల్ ఎత్తు లేపి, దానిపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తాం. ప్రాథమిక పాఠశాలకు రూ.13.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. 1997లో నిర్మించిన భవనం లీకేజీ అవుతోంది. దానికి మరమ్మతులు చేయిస్తాం. పాతబిల్డింగ్కు పెయింటింగ్ చేయిస్తాం. డైనింగ్‌హాల్ ఏర్పాటు చేస్తాం.
- మోత్కూరి మధు, రోటరీనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు
హైదరాబాద్‌లో ఇంకా అంచనాల దశల్లోనే..!
నవతెలంగాణ-సిటీబ్యూరో
మన ఊరు-మన బడి పనులు హైదరాబాద్‌లో నత్తన డకన సాగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదు పాయాల అభివృద్ధికి సంబంధించిన పనులు ఇంకా అంచనాలు రూపొందించే దశలోనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా తొలివిడు తలో 239 స్కూళ్లలో 8రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రభు త్వం ఎంపిక చేసింది. అయితే, ఇప్పటివరకు కేవలం 43 పాఠశా లల అంచనాలను రూపొందించి.. పరిపాలన అనుమతుల కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇందులో 34 పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కలెక్టర్ ఆమోదం తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అంచనాలు పూర్తి చేసి.. పనులు ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి వస్తా యా అన్నది అనుమానమే. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. కాగా జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టు లో భాగం గా ఎంపిక మెహుబియా, అలీయా స్కూళ్లలో ఇప్పటివరకు 70శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.