Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీలకు శాశ్వతంగా గుర్తింపు రద్దు చేయాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో భ్లాక్దందాపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేశాయి. బ్లాక్ దందా చేస్తున్న కాలేజీలకు శాశ్వతంగా గుర్తింపును రద్దు చేయాలని కోరాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు, డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెడికల్ విద్యలో పీజీ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థులను ప్రలోభపెట్టి ఎన్ఆర్ఐ కోటాలో కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటూ కొన్ని ప్రయివేటు కాలేజీలు దందాకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమేనని తేలిన కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అందించడమే లక్ష్యంగా ఏర్పడిన కాలేజీలకు కేవలం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాజకీయ నాయకులు నడిపే మెడికల్ కాలేజీల దందాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. లేదంటే ఆయా కాలేజీల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.