Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యాపేట జిల్లా కోదాడలో యువతిపై మూడురోజుల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాత్రి యువతిని బలవంతంగా కిడ్నాప్‌చేసి నయా నగర్‌లోని ఒక ఇంట్లో బంధించి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందుకలిపి బలవంతంగా తాగించి లైంగిక దాడికి ఒడిగట్టడం దారుణమని పేర్కొన్నారు. యువతిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలనీ, ఈ ఘటనపై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి ఘటనపై జ్యూడీషియల్ విచారణ జరిపించాలి
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ హత్యపై న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మరో ప్రకటనలో డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణను అమ్మాయి తండ్రి వెంకటేష్ హత్య చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మనువాద భావజాల ప్రభావం వల్ల రాష్ట్రంలో కులదురంహకార దాడులు పెచ్చుమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కూతురుకు నెలల పాప ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయి కిరాతకంగా ఆయుధాలతో పత్రికల్లో రాయలేని విధంగా హింసించి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. భార్గవికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆర్థిక సహాయం చేయడంతో పాటు పాప చదువుకయ్యే ఖర్చులన్నింటినీ రాష్ట్ర సర్కారు భరించాలని డిమాండ్ చేశారు.