Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ కాలేయ దినోత్సవ వేడుకల్లో డాక్టర్ సీహెచ్.మధుసూదన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాలేయాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని ఉస్మానియా ఆస్పత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్.మధుసూదన్ సూచించారు. మంగళవారం ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ మద్యపానానికి దూరంగా ఉండాలనీ, కొవ్వు పదార్థాలు తీసుకోవద్దనీ, అనవసర మందుల వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలని, రోజు వారి వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అవయవదానం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనీ , అందరికి తెలియజేసి తద్వారా బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. తమకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ కాలేయం సంబంధిత వ్యాధులు, దుష్పరిణామాలు ,దురలవాట్లు, జీవనశైలి, వంశ పరంపరంగా వచ్చే వ్యాధుల గురించి వివరించారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, ఆడ్మినిస్ట్రేటివ్ విభాగం ఆర్ఎంఓ 1 డాక్టర్ బి.శేషాద్రి, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ , అనేస్తిషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.