Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆత్మగౌరవ భవనాల పేరిట వృత్తిదారుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీతారాంపురం సీపీఐ(ఎం) అమరవీరుల స్మారక భవనంలో వృత్తిదారుల నియోజకవర్గ స్థాయి సదస్సు పొదిలి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వృత్తిదారులు సంక్షేమం కోసం అనేక వాగ్దానాలు ఇచ్చిందన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో హామీలు అమలు కాలేదని.. సంక్షేమానికి, అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులోనూ వివక్ష ప్రదర్శించారన్నారు. 34 రకాల వృత్తులు.. 25శాతం ప్రజలు చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నారన్నారు. ఈ ఏడాది కేవలం రూ.5,697 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారని తెలిపారు. గత బడ్జెట్ కూడా ఖర్చు చేయలేదని.. 11 వివిధ రకాల ఫెడరేషన్లు, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నా నేటికీ వాటికి పాలక వర్గాలు లేకపోవడం ప్రభుత్వ వివక్షకు అద్దం పడుతోందన్నారు. చేనేత, గీత, గొర్రెల కాపరులు, రజక, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరి, కమ్మరి, మేదరి, సంచార జాతుల వారు రుణాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గతంలో 190 జీవో ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసినటువంటి 5.70లక్షల మంది వృత్తిదారులకు రుణాలు ఇవ్వలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌కు నిధులు లేకపోవడంతో జిల్లాల్లో ఉచిత విగ్రహాలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ సామాజిక తరగతుల అభివృద్ధి సంక్షేమం కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ వృత్తుల ఆత్మగౌరవ భవనాలను వెంటనే పూర్తిచేయాలని, దరఖాస్తు చేసిన వాళ్లందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా వివిధ వృత్తిదారులను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేతివృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, జీఎంపీఎస్్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాముల, రజక వృత్తిదారుల సంఘం నాయకులు పొదిలి శ్రీనివాస్ మిర్యాలగూడ, రజకసంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.