Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత విమర్శలు సరికాదు
- ఎస్వోపీని పాటించటం తప్పనిసరి : రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌరదర రాజన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య దూరం రోజురోజుకు మరింత పెరుగుతున్నది. దీంతో వారి మధ్య విబేధాలు ముదిరి పాకాన పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వారి మాటలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. మంగళవారం మీడియాతో మాట్లాడిన తమిళి సై... రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చేసిన అన్ని సిఫారసులను ఆమోదించలేనని తేల్చి చెప్పారు. అలా ఆమోదించాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. వ్యక్తిగత విమర్శలు సరికావని అన్నారు. విభేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేతప్ప ఇలాంటి అంశాలను వ్యక్తిగత వ్యవహారాలకు ఆపాదించొద్దని అన్నారు. ''నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఉండాలి. అనేక విషయాల్లో అభిప్రాయభేదాలు ఉండొచ్చు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎన్నో సిఫార్సులు చేస్తారు. వాటన్నింటినీ నేను ఆమోదించలేను. ఇది పూర్తిగా రాజ్యాంగపరమైన అంశం. ఆయా హక్కులను ఉపయోగించి ఏదైనా విషయంలో గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటే.. అది నా విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే అవుతుంది తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ ఆమోదించకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు గవర్నర్ విందును బహిష్కరించాయి. గవర్నర్ను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా చూడటం సరికాదు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒకరు తమ అభిప్రాయం చెప్పగానే విమర్శించడం సరికాదు. అంతే కాకుండా కొన్ని ప్రొటోకాల్స్ని ఉల్లంఘిస్తున్నారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. విషయమేదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటే వివాదం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచనా ధోరణి సరైంది కాదు. ఏం జరిగినా సరే వ్యవస్థలోని ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పాటించడం తప్పనిసరి. సందర్భం, విషయం ఏదైనా సరే ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనలు పాటించాలి. అలా చేయడం ద్వారా రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన వాళ్లమవుతాం. పరస్పర గౌరవం, అవగాహనతో మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయి...' అని తమిళిసై వ్యాఖ్యానించారు.